IMD Alert: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్-the imd has predicted heavy to very heavy rains in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Imd Alert: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్

IMD Alert: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్

IMD Alert: తెలంగాణలో వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు (HT)

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని.. వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని 4 నుంచి 11 జిల్లాల్లో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

వాయుగుండంగా మారే ఛాన్స్..

తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఇది శుక్రవారం వాయవ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వివరించింది. రేపటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండంగా మారవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.

ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..

శుక్రవారం నాడు కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. శనివారం నాడు ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు. ఆదివారం రోజున రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

హైదరాబాద్‌లోనూ..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ వాతావరణం మారిపోయింది. వెదర్ కూల్‌గా ఉంది. హైదరాబాద్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. భారీ వర్షాల కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. అధికారులు అలెర్ట్ అయ్యారు. ముంపు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.