Hyderabad Crime : ఇన్‌స్టా రీల్స్ మోజు! భార్యను హత్య చేసిన భర్త-the husband who killed his wife was making insta reels in uppal hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : ఇన్‌స్టా రీల్స్ మోజు! భార్యను హత్య చేసిన భర్త

Hyderabad Crime : ఇన్‌స్టా రీల్స్ మోజు! భార్యను హత్య చేసిన భర్త

Hyderabad Crime News: ఇంటి వ్యవహారాలను పట్టించుకోకుండా ఇన్ స్టా రీల్స్ చేస్తోందన్న కోపంతో భార్యను భర్త హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో వెలుగు చూసింది.

భార్యను హత్య చేసిన భర్త (representative image ) (image source unsplash.com)

Hyderabad Crime News: రీల్స్ వ్యవహారంలో ఓ ప్రాణం బలైంది. ఇంటి పనులను పట్టించుకోకుండా కేవలం ఇన్ స్టా రీల్స్ చేస్తుండటంతో పాటు ఫోన్లు మాట్లాడుతుండటంతో భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. చివరగా భార్యను హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో వెలుగు చూసింది.

పోలీసుల వివరాల ప్రకారం….. ఉప్పల్ లో మధు స్మిత, ప్రదీప్ బోలా దంపతులు అద్దెకు నివాసం ఉంటున్నారు. వీరి మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. భార్య ఇన్ స్టా రీల్స్ చేస్తుండటం, ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతుండటంతో భర్త అనుమానం పెంచుకున్నాడుయ పైగా ఆమె ప్రవర్తనలో మార్పులను గమనించాడు. ఇదే విషయంలో తరచుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తర్వాత భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే పీటతో భార్య తలపై కొట్టాడు. మధుస్మిత స్పృహ కోల్పోయివటంతో… ఆమె మెడకు చున్నితో బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని బాత్ రూంలో ఓ సంచిలో ఉంచి తాళం వేసి అక్కడ్నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉప్పల్ పోలీసులు కేసును చేధించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగి…. భర్త ప్రదీప్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. తానే హత్య చేసినట్లు భర్త ఒప్పుకున్నాడు. భర్త ప్రదీప్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు.

ఫేక్స్ రీల్స్ - తుపాకీతో బెదిరించి దోపిడీ

జల్సాలకు అలవాటుపడిన ముగ్గురు యువకులు అమాయకులను ఆసరా చేసుకుని దోపిడీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

నిర్మల్ పట్టణానికి చెందిన ముగ్గురు యువకులును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జిల్లా పోలీసు అధికారి జానకి షర్మిల కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలు మొదలెట్టారని, నకిలీ తుపాకీ, కత్తి వంటి మారణాయుధాలను ఉపయోగించి ఒంటరిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతూ అందినకాడికి దోచుకునేవారని అన్నారు.

స్థానిక గుల్జార్ మార్కెట్ కు చెందిన అవేజ్ ఛెస్, చిక్కడపల్లికి చెందిన షేక్ మతీనుద్దీన్, షేక్ ఆదిల్ మిత్రులు. మతిన్ మాఫియా పేరిట సామాజిక మాధ్యమంలో ప్రత్యేకంగా పేజీ ఏర్పా టుచేసుకున్నారు. నకిలీ తుపాకీ, కత్తి వంటి ఆయుధాలను ఉపయోగించి రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేవారు. రాత్రివేళల్లో పట్టణ శివారు ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరిగా కనిపించిన ప్రేమజంటలను, వ్యక్తులపై బెదిరింపులకు పాల్పడేవారు. వారి నుంచి అందినకాడికి దోచుకొనేవారు. ప్రయాణ ప్రాంగణం, ఇతర ప్రదేశాల్లోనూ ఒంటరిగా నిద్రిస్తున్న వారిని సైతం వీరు లక్ష్యంగా చేసుకునేవారు. ఇలా కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా గమనిస్తే వెంటనే.. రీల్స్ చేస్తున్నట్లు నటిస్తూ వివిధ రకాల నటనతో ముందుకు సాగుతూ తప్పించుకునేవారు.

పట్టణ ఎస్సై అశోక్, తన సిబ్బందితో కలిసి స్థానిక శివాజీచౌక్ ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు వీరిని చూసి పారిపోయారు. బయపడి పారిపోతుండగా పోలీసులు పట్టుకుని విచారిస్తే అసలు విషయాలు బయటపడ్డాయి.

వారిని తనిఖీ చేయగా వారివద్ద నకిలీ తుపాకీ పట్టుబడింది. హైదరాబాద్ కు చెందిన గుర్తుతెలియని వ్యక్తి వద్ద వీరు దాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీని సాయంతోనే రీల్స్ చేయడం, బెదిరించి దోచుకోవడం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీరిలో ఒకరు మొబైల్ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడు. నిందితుల నుంచి నకిలీ తుపాకీ, స్కూటీ, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్ కు తరలించారు.