Global Rice Summit 2024 : హైదరాబాద్ వేదికగా ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు - దేశంలోనే తొలిసారి..!
Global Rice Summit-2024 in Hyderabad : మరో అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబర్ రైస్ సమ్మిట్ - 2024 జూన్ 7, 8 తేదీల్లో భాగ్యనగరం వేదికగా జరగనుంది.
Global Rice Summit-2024 in Hyderabad : దేశంలో తొలిసారిగా నిర్వహించే గ్లోబల్ రైస్ సమ్మిట్ -2024 హైదరాబాద్ మహానగరంలో జరగనుంది. అంతర్జాతీయ సరకుల ( కమాడిటిస్ ) సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు ఈనెల 7,8 తేదీల్లో జరగనుంది.
భారతదేశ వరి పరిశోధన సంస్థ,ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయం,ఉత్తరప్రదేశ్ లోని చంద్రశేఖర్ ఆజాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత దేశ వరి ఎగుమతుదారుల సమాఖ్యలు ఇందులో పాల్గొననున్నాయి.
30 దేశాల నుంచి వరి ఎగుమతి, దిగుమతి దారులు,భారతీయ అనుబంధ సంస్థల ప్రతినిధులు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు,శాస్త్రవేత్తలు,ఆదర్శ రైతులు రెండు రోజుల సదస్సులో పాల్గొననున్నారు.
ఈ అంశాల పై సదస్సులో చర్చ…
ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ సదస్సుకు వేదికగా ఎంపిక చేశారు. ప్రపంచంలోనే రైస్ వినియోగం ప్రతీ ఏటా పెరుగుతున్న నేపథ్యంలో వరిపంట ప్రాధాన్యం పెంచడంతో పాటు వరిసాగు విస్తీర్ణాన్ని వృథా చేయడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.
ఆహార భద్రత,బియ్యం మార్కెట్ ను విశ్వవ్యాప్తం చేయడం,సాగుకు సాంకేతిక సాయం,ఎగుమతుల పెంపు లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. వరిసాగులో ఎరువుల వాడకం ,వాతావరణ పరిస్థితులను అధిగమిచేలా పంట సాగు,వ్యవసాయానికి సాంకేతిక తోడు వంటి అంశాలను ఈ సదస్సులో చర్చించనున్నారు.
తెలంగాణ వేదికవ్వడం గర్వకారణం : తుమ్మల
దేశంలోనే తొలిసారి జరగబోయే ఈ సదస్సును హైదరాబాద్ లో నిర్వహించడం పట్ల తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు తొలిసారి భారత్ కు ఆతిథ్యం ఇస్తూ ఉండడం......అందులోనూ తెలంగాణ వేదిక అవ్వడం గర్వకారణమన్నారు.
వరి సాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని,ప్రస్తుతం ప్రపంచంలోనే పలు దేశాలు దిగుమతులు కోసం భారత్ వైపు చూస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సదస్సు ద్వారా ఎగుమతి,దిగుమతి దారులకు ఒక వేదిక కల్పించే వీలుంటుందని వ్యాఖ్యానించారు.
ఈ సదస్సును రైతులు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే రైతులకు సరైన ధరతో పాటు పెద్ద మొత్తంలో ఉన్న మార్కెట్ నిలువల సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తుమ్మల అభిప్రాయపడ్డారు.