Sleep Treatment Center : హైదరాబాద్ లో ‘నిద్ర చికిత్సా కేంద్రం’ - ఇవిగో ప్రత్యేకతలు
Sleep Treatment Center in Hyderabad : హైదరాబాద్ వేదికగా నిద్ర చికిత్సా కేంద్రం సేవలు అందుబాటులోకి వచ్చాయి. జూబ్లీ హిల్స్, కూకట్‌పల్లిలో బ్రాంచ్ లు ఉన్నాయని నిర్వాహకురాలు డాక్టర్. హర్షిణి ఎర్రబెల్లి పేర్కొన్నారు. నిద్రలేమి సమస్యలకు సమగ్ర చికిత్సను అందిస్తామని చెప్పారు.
హైదరాబాద్ నగరం సరికొత్త వైద్య సేవలకు వేదికైంది. నిద్ర సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపేలా ‘నిద్ర చికిత్సా కేంద్రాలు’ ఏర్పాటయ్యాయి. మొదటి బ్రాంచ్ జూబ్లీ హిల్స్‌లో ఉండగా… రెండో బ్రాంచ్ కూకట్‌పల్లిలో అందుబాటులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు.
ఈ ప్రారంభ కార్యక్రమానికి కేంద్రా ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ డాక్టర్ లోరెంజో కోర్బెట్టా, బోలోగ్నా విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ డాక్టర్ పియెరో కాండోలి (పల్మోనాలజీ నిపుణులు) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ… నిద్ర యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నిద్ర లేకపోవడం వల్ల కలిగే తీవ్ర పరిణామాలను ప్రస్తావించారు. డయాబెటిస్, రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు మరియు అల్జీమర్స్ వంటి సమస్యలపై మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకురాలు డాక్టర్ హర్షిణిని అభినందించారు.
సమగ్ర చికిత్సను అందిస్తాం - డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి
స్లీప్ థెరప్యూటిక్స్ వ్యవస్థాపకురాలు, నిద్ర నిపుణురాలు డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి మాట్లాడుతూ… నిద్ర సంబంధిత సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. “క్రమరహిత జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, బిజీ షెడ్యూల్‌ల కారణంగా చాలా మంది నిద్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు . వారికి అందుబాటులో ఉన్న చికిత్సల గురించి కూడా అవగాహన ఉండదు. స్లీప్ థెరప్యూటిక్స్ నిద్ర వైద్యంలో ప్రత్యేకత కలిగిన ఒక మార్గదర్శక కేంద్రం. ఇది గురక, నిద్రలేమి, పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం మరియు నిద్రలో నడవడం వంటి వివిధ నిద్ర రుగ్మతలకు సమగ్ర చికిత్సను అందిస్తుంది” అని వివరించారు.
ఈ కేంద్రం అత్యాధునిక సంరక్షణతో స్థానిక సమాజానికి సేవ చేయడానికి అంకితభావంతో పనిచేస్తుందని డాక్టర్ హర్షిణి చెప్పారు. రోగుల సంరక్షణకు సమగ్రమైన, సంపూర్ణ విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఈ కేంద్రం యొక్క మొదటి శాఖ జూబ్లీ హిల్స్‌లో ఉందని… రెండో శాఖ కూకట్‌పల్లిలో ప్రారంభించామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ… నిద్ర రుగ్మతల సామాజిక పరిణామాల గురించి చెప్పారు. గురక కారణంగా విడాకులైన సందర్భాలను కూడా గుర్తు చేశారు. నిద్రలేమి ట్రాఫిక్ ప్రమాదాలకు కారణమైన ఉదంతాలను ఉదహరించారు. నిద్ర సమస్యల గురించి అవగాహన లేకపోవడం ప్రధాన సామాజిక సవాలుగా పేర్కొన్నారు. అవగాహన పెంచడంతో పాటు వైద్య సేవల పురోగతిని ప్రస్తావించారు.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… నిద్రకు భంగం కలిగించడంలో ఒత్తిడి పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు. స్లీప్ థెరప్యూటిక్స్ వంటి ఆధునాతన సేవల గురించి ప్రజల్లో అవగాహన లేదన్నారు. ఇలాంటి వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేంద్రాల ద్వారా నిద్రలేమి సమస్యలను అధిగమించే అవకాశం ఉందన్నారు.
సంబంధిత కథనం