Bhupalpally : కొడుకును చంపిన తండ్రి, పైగా ఏం తెలియనట్లు నటన - 7 నెలల విచారణ తర్వాత వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
Son Killed By Father in Bhupalpally: వ్యాపారంలో నష్టాలు వచ్చాయన్న కారణంతో సొంత తండ్రే కొడుకును హత్య చేశాడు. పైగా ఏం తెలియనట్లు నటించగా… పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి.
Jayashankar Bhupalpally District : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బిజినెస్ లాస్ చేయడంతో పాటు మద్యానికి బానిసై తమను హింసిస్తున్నాడన్న కారణంతో ఓ తండ్రిని తన కొడుకునే హత మార్చాడు. కొడుకును చంపేసి ఆ తరువాత ఏమీ తెలియనట్టుగా నటించాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి చివరకు తండ్రే హంతకుడని నిర్ధారించారు.
ఘటన జరిగిన ఏడు నెలల తరువాత అసలు వాస్తవం బయట పడగా, స్థానికులంతా నివ్వెరపోయారు. రేగొండ మండలం నారాయణపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా, స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నారాయణ పురం గ్రామానికి చెందిన పెరుగు లింగమూర్తికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కాగా లింగమూర్తి సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు పరకాల, రేగొండ, టేకుమట్ల మండల కేంద్రాల్లో ఈ మేరకు సూపర్ మార్కెట్లు కూడా ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉండగా, లింగమూర్తి చిన్నకొడుకు పెరుగు సాయి గణేశ్(23) ఇంటర్ వరకు చదివి, డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. దీంతో చదువులో రాణించకపోవడంతో తండ్రి లింగమూర్తి టేకుమట్లలోని సూపర్ మార్కెట్ నిర్వహణ బాధ్యతను ఆయనకు అప్పగించాడు.
ఈ క్రమంలోనే సాయి గణేశ్ జల్సాలకు అలవాటు పడి ఆన్ లైన్ బెట్టింగులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బిజినెస్ లాస్ వచ్చింది. ఎన్నిసారు చెప్పినా సాయి గణేశ్ తీరులో మార్పు రాకపోవడం, పైగా మద్యానికి బానిసై హింసిస్తుండటంతో తండ్రి లింగమూర్తి తీవ్ర అసహనానికి గురయ్యాడు.
అనుమానాస్పద మృతిగా కేసు
ఫోన్ కు అడిక్ట్ కావడంతో పాటు వ్యాపారం దివాలా తీయడానికి కారణమయ్యాడనే ఆవేశంతో తండ్రి లింగమూర్తి కొడుకును పలుమార్లు మందలించాడు. అయినా తీరు మారలేదు. దీంతో 2023 నవంబర్ నెలలో ఇదే విషయమై తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో లింగమూర్తి కోపంతో సాయి గణేశ్ ను బలం నెట్టేయడం, కర్రతో బలంగా కొట్టడంతో తల గోడకు తగిలి, చెవులో నుంచి రక్తం బయటకు వచ్చింది. ఆ కొద్దిసేపటికే ఆయన మరణించాడు. లింగమూర్తి రేగొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు చెవిలో నుంచి రక్తం కారి చనిపోయాడని, తమకు ఎవరిపైనా అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో రేగొండ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోస్టు మార్టం రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు…
కేసు విచారణ ప్రారంభించిన అధికారులు, అప్పటికే సాయి గణేశ్ డెడ్ బాడీని మార్చురీకి తరలించి, పోస్టు మార్టం నిర్వహించారు. కాగా పోస్టు మార్టం నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
సాయి గణేశ్ తలపై బలమైన గాయాలు అయ్యాయని తేలింది. దీంతో ఉద్దేశ పూర్వకంగానే హతమార్చి తమను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం పోలీసులకు కలిగింది. ఈ మేరకు కేసును లోతుగా విచారణ జరిపారు. ఏడు నెలల పాటు సుధీర్ఘ విచారణ అనంతరం తండ్రి లింగమూర్తి మీద పోలీసులకు అనుమానం కలగగా… ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టారు.
చివరకు తండ్రే కొడుకును హతమార్చాడని నిర్ధారించుకుని… శనివారం సాయంత్రం లింగమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారణ జరపగా, కర్రతో కొట్టి తానే తన కొడుకు సాయి గణేశ్ ను హతమార్చినట్లు లింగమూర్తి పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో లింగమూర్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ వివరించారు.