US Visa Waiting Period: విద్యార్ధులకు అమెరికా వీసా జారీ గడువు తగ్గనున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ కాన్సులేట్
US Visa Waiting Period: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులకు ఊరటనిచ్చే కబురు అందింది. వీసా కోసం వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించేలా నూతన కాన్సులేట్ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
US Visa Waiting Period: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్ధులు వీసా కోసం వేచి ఉండే సమయం కొంత తగ్గిందని, రానున్న రోజుల్లో మరింత తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నిర్మించిన కాన్సులేట్ కొత్త కార్యాలయంలో కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామే తదితరులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.
విద్యార్థులు వీసాలు పొందేందుకు నాలుగు అంశాలు కీలకమని వివరించారు. ఉన్నత విద్యకు మంచి విద్యా సంస్థను ఎంపిక చేసుకొని అక్కడి నుంచి అనుమతి పత్రాన్ని(ఐ-20) పొందాలని కాన్సుల్ అధికారులు సూచించారు. చదవాల్సిన కోర్సుపై కనీస పరిజ్ఞానం, ఆ కోర్సును పూర్తి చేసేందుకు కావాల్సిన ఫీజు ఇతర ఖర్చులను చెల్లించే ఆర్థిక స్థితిని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సును పూర్తి చేసిన తరవాత మాతృదేశానికి తిరిగి వచ్చే విషయంలో స్పష్టత ముఖ్యమని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ సమయంలో ఆయా వివరాలను విద్యార్థులు నిజాయతీగా స్పష్టం చేయాలని, వీసాను తిరస్కరించిన పక్షంలో ఏ నిబంధన మేరకు ఇంటర్వ్యూ అధికారి ఆ నిర్ణయం తీసుకున్నారో స్పష్టం చేస్తూ విద్యార్థికి తక్షణమే లిఖితపూర్వక సమాచారాన్ని అందజేస్తారన్నారు.
ఈ ఏడాది జూన్, జులై నెలల్లో వీసా స్లాట్లలో అత్యధిక స్లాట్లు విద్యార్థులకే ప్రాధాన్యం ఉండనుంది. పర్యాటక వీసా కోసం కరోనా సమయంలో రెండేళ్లపాటు వేచి ఉండాల్సి వచ్చేదని, ప్రస్తుతం దానిని ఆరు నెలలకు తగ్గించారు. ఈ సమయం రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని రెబెకా డ్రామే వివరించారు.
కొత్త కార్యాలయంలో 54 కాన్సులర్ విండోస్….
''అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు రోజురోజుకు బలోపేతం అవుతున్నాయని, మున్ముందు మరింత పురోగమిస్తాయని యూఎస్ కాన్సుల్ జనరల్ తెలిపారు. దక్షిణాసియాలో అతిపెద్ద అమెరికన్ కాన్సులేట్‌గా హైదరాబాద్ చరిత్రలో నిలుస్తుందని వివరించారు. వీసా కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న అమెరికా కాన్సులేట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని గుర్తించి భారతదేశంలోని వివిధ కాన్సులేట్స్‌కు అమెరికా ప్రభుత్వం పంపుతోందని చెప్పారు.
గతంతో పోలిస్తే ఎక్కువ మంది అధికారులు ఈ ఏడాది నుంచి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ ఏడాది భారత్‌లో పది లక్షల వీసా దరఖాస్తులను పరిశీలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. హైదరాబాద్ చైతన్యవంతంగా ఉందని, రెండు దేశాల సంబంధాల బలోపేతం చేయడంలో భాగ్యనగరం కీలక భూమిక పోషిస్తోందని చెప్పారు. వాణిజ్య సంబంధాలు ఈ ప్రాంతంలో గణనీయంగా ఉండటంతో విదేశీ వాణిజ్య సేవల అధికారిని ఇక్కడ ప్రత్యేకంగా అమెరికా ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. వీసా జారీ, అమెరికా పౌరుల పాస్‌పోర్టు తదితర సేవలకోసం పైగా ప్యాలెస్‌లో 16 కాన్సులర్ విండోస్ అందుబాటులో ఉండేవని, నూతన కాన్సులేట్‌లో ఆ సంఖ్యను 54కు పెంచామని చెప్పారు.
రెన్యువల్స్ ఇక డ్రాప్‌బాక్స్ ద్వారానే...
'పలు రకాల వీసాల రెన్యువల్స్ దరఖాస్తుదారులు కాన్సులేట్‌కు వచ్చే పని లేకుండా నేరుగా డ్రాప్ బాక్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు కాన్సుల్ జనరల్ తెలిపారు. గతంలో జారీ చేసిన ఎఫ్-1 వీసాలు ఉన్న విద్యార్థులు కూడా డ్రాప్ బాక్స్ నిబంధనలకు అర్హులై ఉంటే ఆ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు.
''తొలిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే కాన్సులేట్‌కు వచ్చేలా చూస్తున్నట్లు వివరించారు. పైగా ప్యాలెస్‌లో అత్యధికంగా ఒక రోజు 1,100 వీసా ఇంటర్వ్యూలను నిర్వహించామని, నూతన కాన్సులేట్ కార్యాలయంలో అన్ని రకాలు కలిపి రోజు 3,500 దరఖాస్తుల్ని ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు వీలుగా సదుపాయాలను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
కార్యాలయంలో సేవలు పూర్తి సామర్థ్యానికి రావటానికి కొంత సమయం పడుతుందని రెబకా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా గడిచిన ఏడాది హెచ్, ఎల్, తదితర వీసాలు పొందిన వారిలో భారతీయులు 65 శాతం మంది ఉన్నారని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా 17.5 శాతం మంది భారతీయులే ఉన్నారని వివరించారు.