Warangal Train Track : రైళ్లకు రైట్.. రైట్.. యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ.. దటీజ్ ఇండియన్ రైల్వే
Warangal Train Track : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దీంతో చాలాచోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ట్రాక్‌లకు మరమ్మత్తులు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలాచోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలోని ఇంటికన్నే వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. వెంటనే స్పందించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు.. పునరుద్ధరణ పనులు చేపట్టారు. దక్షణి మధ్య రైల్వే అధికారులు వరద ప్రభావిత ప్రాంతంలో క్యాంపింగ్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
భారీ వర్షాల ధాటికి..
భారీ వర్షాల దాటికి మహబూబాబాద్ సమీపంలో ఉన్న అయోధ్య చెరువు కట్టు తెగింది. ఎగువ, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. రైలు పట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. మహబూబాబాద్ లోనే మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ తోపాటు పలు రైళ్లను నిలిపివేశారు. ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు.
వరంగల్- విజయవాడ మధ్యలో..
మరోవైపు విజయవాడ -వరంగల్ మధ్యలో పలుచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దారి మళ్లింపు కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను కూడా రద్దు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందిపడ్డారు.
69 రైళ్లు రద్దు..
భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ వరకు 69 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. పలుచోట్ల పట్టాలపైకి వరదనీరు చేరడంతో.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 69 రైళ్లను రద్దు చేసి.. 10 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు. భద్రాచలం రోడ్- బల్లార్షా, విశాఖ-మహబూబ్‌నగర్ రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్- విశాఖపట్నం- హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లను సోమవారం రద్దు చేసినట్లు వెల్లడించారు.