ఓరుగల్లులో కాకతీయుల వారసుడు.. వరంగల్ లో పర్యటించిన కమల్ చంద్ర భంజ్ దేవ్-the descendant of the kakatiyas in orugallu kamal chandra bhanj dev visited warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఓరుగల్లులో కాకతీయుల వారసుడు.. వరంగల్ లో పర్యటించిన కమల్ చంద్ర భంజ్ దేవ్

ఓరుగల్లులో కాకతీయుల వారసుడు.. వరంగల్ లో పర్యటించిన కమల్ చంద్ర భంజ్ దేవ్

Sarath Chandra.B HT Telugu

కాకతీయులు ఏలిన గడ్డపై వారి వారసుడు అడుగు పెట్టాడు. దాదాపు మూడేళ్ల కిందట తొలి సారి ఓరుగల్లుకు వచ్చిన కాకతీయుల వంశానికి చెందిన 22వ మహారాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ మంగళవారం మరోసారి వరంగల్ నగరానికి వచ్చారు.

భద్రకాళీ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న కాకతీయ రాజుల వారసుడు కమల్ చంద్ర

కాకతీయ వంశానికి చెందిన మహరాజు కమల్ చంద్ర భంజ్‌ దేవ్‌ కాకతీయ పర్యటనలో భాగంగా ఓరుగల్లు నగరానికి వచ్చి హనుమకొండలోని వేయి స్తంభాల గుడితోపాటు భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొద్దిరోజుల కిందటే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న సుందరీమణులు వేయి స్తంభాల గుడిని సందర్శించి వెళ్లగా.. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కాకతీయుల రాజైన కమల్ చంద్ర భంజ్ దేవ్ వరంగల్ లో పర్యటించడం హాట్ టాపిక్ గా మారింది.

కోటలో ప్రత్యేక పూజలు

కమల్ చంద్ర భంజ్ దేవ్ మంగళవారం ఉదయం వరంగల్ నగరానికి చేరుకోగా.. మొదట బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కమల్ చంద్ర భంజ్ దేవ్ నేరుగా వినయ్ భాస్కర్ తో కలిసి తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. దీంతో ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక ఆశీర్వచనాలు కూడా అందజేశారు.

అనంతరం కమల్ చంద్ర భంజ్ దేవ్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్ లోని రాణి రుద్రమా దేవి విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి వరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. చతుర్ముఖ శివ లింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రెడ్డిపురంలోని టార్చ్ సంస్థ వ్యవస్థాపకుడు అరవింద్ ఆర్య ఇంటిని కమల్ చంద్ర భంజ్ దేవ్ సందర్శించారు.

హరితలో మీట్ అండ్ గ్రీట్

కాకతీయుల వంశ 22వ రాజైన కమల్ చంద్ర భంజ్ దేవ్ వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండ హరిత కాకతీయ హోటల్ లో స్థానికులతో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలతో కమల్ చంద్ర భంజ్ దేవ్ వివిధ విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కమల్ చంద్ర భంజ్ దేవ్ కోరారు. ప్రపంచానికి విజ్ఞానం, సంప్రదాయాలు, సంస్కృతిని పరిచయం చేసిన మహోన్నత దేశం భారత్ అని కొనియాడారు. ప్రపంచ దేశాలకు భాష, లిపి లేనప్పుడే భారతదేశంలో భాష, లిపిని ఉపయోగించినట్లు తెలిపారు.

ఎయిర్ పోర్టుకు రుద్రమపేరు

వరంగల్ నగరంలోని మామునూరు వద్ద పునరుద్ధరిస్తున్న విమానాశ్రయానికి రాణి రుద్రమా దేవి పేరు పెట్టాలని గతంలోనే ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్టు కమల్ చంద్ర భంజ్ దేవ్ తెలిపారు. కాకతీయుల సంపద అయిన కోహినూరు వజ్రాన్ని కూడా బ్రిటన్ నుంచి తెప్పించే ప్రయత్నం చేయాలని ప్రధానిని కోరినట్లు వెల్లడించారు.

భారతదేశ, తెలంగాణ పురాతన కట్టడాలు, వారసత్వ సంపదలను పరిరక్షించి భావి తరాలకు అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరానని పేర్కొన్నారు. వారసత్వ సంపదతో పాటు మన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని చెప్పారు. బస్తర్ దసరా పండుగను 72 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు.

భావి తరాలకు సంస్కృతీ, సంప్రదాయాలు, వారసత్వ సంపద, చరిత్రాత్మక కట్టడాలు, దేశ చరిత్ర గురించి తెలపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మన ఆచార వ్యవహారాలను మనమే కాపాడుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వారసత్వ సంపద రక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

కాకతీయ వంశానికి చెందిన కమల్ చంద్ర భంజ్‌ దేవ్‌
కాకతీయ వంశానికి చెందిన కమల్ చంద్ర భంజ్‌ దేవ్‌
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం