Telangana Secreteriat: ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం-the date for the inauguration of the new telangana secretariat has been fixed on 30th april ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  The Date For The Inauguration Of The New Telangana Secretariat Has Been Fixed On 30th April

Telangana Secreteriat: ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం

HT Telugu Desk HT Telugu
Apr 26, 2023 10:14 AM IST

Telangana Secreteriat: తెలంగాణలో కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగాన్ని ప్రారంభిస్తారు.

తెలంగాణ సచివాలయం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ సచివాలయం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి

Telangana Secreteriat: తెలంగాణలో కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగాన్ని ప్రారంభిస్తారు. యాగం పూర్తైన తర్వాత మధ్యాహ్నం1.20 నుంచి 1.30 మధ్య పూర్ణాహుతి చేస్తారు. ఆ వెంటనే కొత్త సెక్రటేరియెట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

సచివాలాయాన్ని ప్రారంభించిన వెంటనే 6వ అంతస్తులోని తన చాంబర్లో సీఎం కేసీఆర్ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం1.58 నుంచి 2.04 మధ్య మంత్రులు, ఆఫీసర్లు తమ చాంబర్లలో కొలువుదీరుతారు.

సచివాలయ భవనం ప్రారంబమైన తొలి ఆరు నిమిషాల్లో ఒక ఫైల్ మీద సంతకం చేయాలని మంత్రులకు, అధికారులకు జీఏడీ సూచించింది. మధ్యాహ్నం 2.15కు సెక్రటేరియెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడతారు. మే ఒకటో తేదీన సెలవు కావడంతో, రెండో తేదీ నుంచి సీఎం, సీఎంఓ అధికారులు, మంత్రులు, సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు కొత్త సెక్రటేరియెట్ నుంచే పూర్తిస్థాయి విధులు నిర్వహించనున్నారు.

సచివాలయంలో శాఖలకు కార్యాలయాల కేటాయింపు పూర్తి

కొత్త సచివాలయ భవనంలో ఒక్కో ఫ్లోర్​లో 3, 4 డిపార్ట్​మెంట్లు కొలువుదీరనున్నాయి. కొత్త సెక్రటేరియెట్​లో ఏ డిపార్ట్​మెంట్ ఏ ఫ్లోర్​లో ఉండాలనే దానిపై సాధారణ పరిపాలన శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి ఫైల్స్, కంప్యూటర్లు, జిరాక్స్ మెషీన్లను అయా శాఖల కార్యాలయాలకు తరలించనున్నారు. ఒక్కో ఫ్లోర్​లో మూడు, నాలుగు శాఖలకు గదులను కేటాయించారు. ఆరో అంతస్తులో సీఎం, సీఎంఓ, సీఎస్ కార్యాలయం ఉంటుంది. ఐదో ఫ్లోర్ లో జీఏడీ, ఆర్​అండ్​బీ, నాలుగో ఫ్లోర్​లో ఇరిగేషన్, లా, బీసీ వెల్ఫేర్, మూడో ఫ్లోర్​లో ఐటీ, మున్సిపల్, రెండో ఫ్లోర్​లో ఫైనాన్స్, ఫస్ట్ ఫ్లోర్​లో పంచాయతీరాజ్, గ్రౌండ్​ ఫ్లోర్​లో రెవెన్యూ, ఎస్సీ డెవలప్​మెంట్ శాఖలకు గదులను కేటాయించారు.

నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి….

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సచివాలయ నిర్మాణానికి జూన్‌ 27, 2019న శంకుస్థాపన చేశారు.అత్యాధునిక హంగులతో కూడిన భవన సముదాయాన్ని పూర్తిచేసి, ప్రారంభానికి సిద్ధం చేశారు. ఇండో-పర్షియన్‌ నిర్మాణశైలిలో చారిత్రక కట్టడం తరహాలో భవనాన్ని డిజైన్‌ చేశారు. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీకి పనులు అప్పగించారు. డిజైన్లు పూర్తై, పనులు ప్రారంభమైన తర్వాత దాదాపు 26 నెలల్లోనే భవనాన్ని సిద్దం చేశారు.

రాష్ట్ర హైకోర్టు తరహాలోనే సచివాలయంపై డోమ్‌లు నిర్మించారు. రెండు డోమ్‌లపై నిర్మించిన జాతీయ చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం 34 డోమ్‌లను ఏర్పాటు చేశారు. సచివాలయానికి ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన డోమ్‌లు ఎత్తైనవి. సుమారు 165 అడుగుల ఎత్తున ఉన్న డోమ్‌పై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేయడంతో సుదూర ప్రాంతంనుంచి కూడా ఇవి కనిపిస్తాయి.

సచివాలయంలో నీటి సరఫరా కోసం హైడ్రో న్యుమాటిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించేలా తగిన ఏర్పాట్లు చేశారు. వర్షపునీటిని స్టోర్‌ చేసేందుకు సంపును ఏర్పాటు చేశారు. భవనంపై పడిన నీటిచుక్కకూడా వృథాకాకుండా అవి సంపులోకి చేరేలా చేసి జలసంరక్షణ ప్రాధాన్యత ఇచ్చారు.

కొత్త సచివాలయాన్ని గ్రీన్‌ కాన్సెప్ట్‌ విధానంలో నిర్మించారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా డిజైన్‌ చేశారు. భవనం చుట్టూ గదులు, మధ్యలో ఖాళీ స్థలం ఉంచారు. అన్నివైపుల నుంచి వెంటిలేషన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. మొత్తం ఎనిమిది ఎకరాల స్థలాన్ని పచ్చదనం కోసం కేటాయించారు. పచ్చికతోపాటు మొక్కలను కూడా నాటారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌వైపు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం లో క్యాంటీన్‌, అదే వరుసలో గుడి, బ్యాంకు, ఏటీఎం ఉంటా యి. సచివాలయ ప్రాంగణంలో రెం డున్నర ఎకరాల్లో 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, నాలుగు బస్సులకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. సందర్శకులకోసం మరో 300 కార్లు పట్టేలా ఒకటిన్నర ఎకరాల్లో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. రోజువారీ సందర్శకులు, అధికారులు, ప్రత్యేక సమావేశాల సందర్భంలో వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచి ఏర్పాట్లు చేవారు.

ఆరో అంతస్థులో సీఎం కార్యాలయం

సచివాలయంలోని ఆరో అంతస్థులో సీఎం, చీఫ్‌ సెక్రటరీల చాంబర్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సీఎం సిబ్బంది, ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు ‘జనహిత’ పేరుతో 250 మంది కూర్చునేవిధంగా సమావేశ మందిరం, మంత్రులు, అధికారులకు సరిపడా క్యాబినెట్‌ సమావేశం కోసం మరో హాలు, సీఎంను కలిసేందుకు వచ్చేవారికోసం ప్రత్యేక వెయిటింగ్‌ హాలును నిర్మించారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణకు కూడా ప్రత్యేక సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. కనీసం 25 మంది విశిష్ట అతిథులతో ముఖ్యమంత్రి కలిసి భోజనం చేసేందుకు ఓ అత్యాధునిక డైనింగ్‌ హాలును కూడా ఆరో అంతస్తులో ఉంది.

నేడు రేపు శాఖల తరలింపు…

నూతన సచివాలయం ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్యాలయాల తరలింపు చేయనున్నారు. 30వ తేదీ నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖలు తమకు కేటాయించిన గదులకు సామగ్రిని బుధవారం నుంచి శుక్రవారం వరకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. షిఫ్టింగ్‌ చేయాల్సిన సమయాన్ని కూడా అధికారులు నిర్ధారించారు. ఒక్కో అంతస్తులో మూడు శాఖల కార్యాలయాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఫైళ్లు, కంప్యూటర్లు, జిరాక్స్‌ మిషన్లు తదితర వాటిని జాగ్రత్తగా తరలించాలని, ముఖ్యమైన ఫైళ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఫైళ్లకు ఆయా శాఖల ఉద్యోగులు, అధికారులదే పూర్తి బాధ్యతని స్పష్టంచేశారు.

WhatsApp channel