TS Police Recruitment: తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి చేపట్టిన స్పెషల్ పోలీస్ నియామకాల్లో జీవో నంబర్ 46ను మినహాయించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వనస్థలిపురంలో ఆందోళనకు దిగిన అభ్యర్దులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంత యువకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తెలంగాణలో గ్రామీణ జిల్లాల నిరుద్యోగ పోలీస్ అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022–23లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
జీవో నంబర్ 46వల్ల గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉంటూ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర స్థాయిలో నియమించే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలలో అర్హత కోల్పోతారని చెబుతున్నారు.
ఉమ్మడి హైదరాబాదు జిల్లాకి 53% రిజర్వేషన్ కల్పించి మిగతా 26 జిల్లాలకి 47% కేటాయించడం వల్ల ఇతర జిల్లాల గ్రామీణ అభ్యర్థులకి తక్కువ స్థాయిలో ఉద్యోగాలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఇతర గ్రామీణ జిల్లాలలో నివసిస్తూ 130 మార్కులు పైగా సాధిస్తే తప్ప ఉద్యోగం రాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అదే హైదరాబాద్ జిల్లాలో 80 (+) మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందంటున్నారు.
హైదరాబాద్ జిల్లాలోనే TSSPలో 53% కోటా ప్రకారం 2000 పైన ఉద్యోగాలు ఉన్నాయని, పోస్టుల కేటాయింపులో గ్రామీణ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.
తాజా నియామకాల్లో జీవో 46 నుంచి TSSP కానిస్టేబుల్ పోస్టులను మినహాయించి 2016, 2018 లో నియామకాలలో ఎలా నియామకాలు చేపట్టారో ఈ దఫా కూడా అలాగే రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.