GO 317 Problems : నష్టపోయిన ఉద్యోగుల వివరాలివ్వండి - జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు
Telangana Govt GO 317 : జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. పలు కీలక అంశాలపై చర్చించింది.
Telangana Govt GO 317 : జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది.
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమాచారం అందించినా ... మరికొన్ని శాఖల నుండి 317 జీవో బాధిత ఉద్యోగులకు సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం రావాల్సి ఉందని క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.
317 జీవో కింద వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన మీదట 30 నుంచి 40 శాతం మంది ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు పునరావృత్తం అయినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ గుర్తించింది.
అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను ఉపయోగించుకొని కొందరు సొంత జిల్లాలకు వెళ్లేందుకు తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తెచ్చారు.
ఎవరికైతే 317 జీవో లో అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అన్యాయం జరిగిన ఉద్యోగస్తులను గుర్తించి వారి వివరాలను త్వరలో కమిటీకి అందజేయాలని అధికారులను క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది.
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే..
జీవో 317 సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం జులై 11వ తేదీన కూడా భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.
క్యాబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతులకు పంపించాల్సిందిగా జీఏడీ అధికారులకు సబ్ కమిటీ ఆదేశించింది. మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలన చేసిన అనంతరం తిరిగి క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది.
317 జీవో వివాదం…!
గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 317 జీవోను తీసుకొచ్చింది. రాష్ట్రంలో కొత్త జోన్ల వ్యవస్థ అమలులోకి రావటంతో.. కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, మల్టీ జోన్లకు.. ఉద్యోగాలను, ఉద్యోగులను సర్దుబాటు చేసే ప్రక్రియను నాటి ప్రభుత్వం ప్రారంభించింది. 2021 డిసెంబర్ 6వ తేదీన ఈ జీఓను జారీ చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు.. ఆ పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పరిధిలోని కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లటానికి ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది.
ఈ ఆప్షన్లకు ఆ కేడర్ పోస్టులో సీనియారిటీని ప్రధాన ప్రాతిపదికగా నిర్ణయించింది. వికలాంగులతో పాచు పలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత కింద ఆప్షన్లు ఎంచుకునే వెసులుబాటును కల్పించింది. అయితే మల్టీ జోనల్, జోనల్ కేడర్ పోస్టుల్లో కన్నా జిల్లా కేడర్ ఉద్యోగుల సర్దుబాటుపై ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమమయ్యాయి.
ఈ నేపథ్యంలో జీఓ 317ను వ్యతిరేకిస్తూ డిసెంబర్ చివరి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు.ఉద్యోగుల స్థానికతను 317 జీఓ పరిగణనలోకి తీసుకోవటం లేదని ప్రధానంగా ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా పని చేయాల్సిన తమను వేరే జిల్లాలకు బదిలీ చేస్తున్నారని చెబుతున్నారు. కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు.. చాలా శాఖల్లోని ఉద్యోగస్తులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గం ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ్మ అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు కాగా… జీవో 317 సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది.
సంబంధిత కథనం