Karthika Pournami Temples: కార్తీక పౌర్ణమి శోభ... గోదావరి తీర ఆలయాల్లో భక్తుల సందడి..పరమశి వునికి పూజలు
Karthika Pournami Temples: కార్తీక మాసం...పైగా పౌర్ణమి ఆలయాలన్ని సరికొత్తశోభను సంతరించుకున్నాయి. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారి శివనామస్మరణ మారుమోగుతోంది.. శైవక్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.. తీరొక్క పూజలతో భక్తజనులు పులకించిపోతున్నారు.
Karthika Pournami Temples: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపవాస దీక్షలతో పరమశివున్ని ఆరాధిస్తున్నారు. ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగిస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి గంగమ్మకు పూజలు చేస్తూ హారతులిస్తున్నారు.
కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో మహా విష్ణువును తులసీదళాలు, కమలాలతో పూజిస్తే సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే, ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి, సోమవారం, కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతో, రుద్రాక్షలతో పూజించిన వారు అనంత సౌఖ్యాలతోపాటు శివ సాయుజ్యం పొందుతారని పురోహితులు అంటున్నారు. కార్తీక పౌర్ణమి రోజు అయ్యప్ప భక్తులు మాలధారణతో దీక్ష భూనుతారు. చాలామంది తమ ఇళ్లలో తులసీ కల్యాణం(తులసి కోటకు ఉసిరి మొక్కను జోడించి) జరిపిస్తారు.
మట్టి ప్రమిదల్లో దీపాలు
కార్తీక పౌర్ణమి రోజు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, శివాలయాల్లో రుద్రాభిషేకం చేయిస్తారు. మట్టి ప్రమిదల్లో 365 వత్తులతో దీపాలను ఆవు నెయ్యితో వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపో తాయని కార్తీక పురాణంలోని గాధలు, ఇతివృత్తాలు, ఉపకథలు చెబుతున్నాయి. అలాగే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు ఉండే దాన్ని కార్తీక మాసంగా పిలుస్తారు. ఈ సమయంలో నీరు, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతారు. చంద్రుడు చాలా శక్తివంతంగా ఉండటంతో దీనికి కౌముది మాసమని పేరు.
గోదావరిలో పుణ్యస్నానాలు..
దేశంలోనే గంగానది తర్వాత రెండో అతిపెద్ద నది గోదావరి, మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ లో జన్మించి, 910 మైళ్లు(1,465 కిలోమీటర్లు) ప్రయాణిస్తుంది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద మన రాష్ట్రంలో ప్రవేశించి, 600 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో మొదలై, మంథనిలో నియోజకవర్గంలోని కాళేశ్వరం వద్ద ముగుస్తుంది.
11 మండలాల్లో 170 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం ఉంటుంది. గోదావరి తీరం వెంబడి శ్రీలక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ధర్మపురి, వెల్గటూరు మండలం కోటి లింగాల, అంతర్గాం, రామగుండం, గోదావరిఖని, కమాన్ పూర్, మంథని, కాళేశ్వరం పుణ్యక్షేత్రాల సమీపంలో ప్రవహించే నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి, స్వామివార్లకు పూజలు నిర్వహిస్తారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని ఫకీర్ కొండాపూర్, కోమటి కొండాపూర్, ఎర్దండి, మల్లాపూర్ మండలంలోని వాల్గొండ, సారంగాపూర్ ప్రాంతాలు కూడా స్నానాలకు అనుకూలం. గోదావరి నదీ ప్రవాహం వెంట ఉన్న గ్రామాలు, ప్రాంతాల్లో కార్తీక స్నానాలు చేయడం అనాదిగా వస్తోంది. ప్రధానంగా వాల్గొండ రామలింగేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి,కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయం, మంథని గౌతమేశ్వరాలయం, కాళేశ్వరం కాళేశ్వరముక్తేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.
గోదావరి జలాల్లో ఔషధ విలువలు
కార్తీక స్నానాలు కేవలం పాపప్రక్షాళన, సర్వ దేవతల ప్రసన్నం కోసమే కాదు ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుంది. ఎక్కడో పుట్టిన నదీ జలాలు కొండకోనలు దాటుతూ ఆయా ప్రాంతాల్లో పెరిగిన వివిధ రకాల ఔషధ మొక్కలను స్పర్శిస్తూ వస్తాయి. కాబట్టి నదీ జలాల్లోనూ ఔషధ విలువలు ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆలయాలకు భక్తుల రద్దీ..
కార్తీక పౌర్ణమి సందర్బంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బారులు తీరి ప్రత్యేక పూజలు దీపారాధనలు చేశారు. భక్తుల రద్దీతో స్వామి వారి దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు. సాయంత్రం ఆలయం ముందు జ్వాలా తోరణం నిర్వహిస్తారు. అటు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని బ్రహ్మపుష్కరిణిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం పంచ సహస్ర దీపాలంకరణ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
ఉసిరితో స్నానం...365 వత్తులతో దీపం
కార్తీక పౌర్ణమి రోజున పొద్దున్నే 4 గంటలకు లేచి, ఇంటిని శుభ్రం చేసుకొని, ఉసిరితో స్నానం చేస్తారు. తులసి మాతకు, ఉసిరి చెట్టుకు కల్యాణం చేసి, 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. కొందరు లక్ష్మీపూజ, కార్తీక వత్రం చేసుకుంటారు. భక్తితో శివకేశవులను ఆరాధిస్తారు.
శుభాలు కలుగుతాయి
కార్తీక పౌర్ణమి నాడు ఉదయం మేల్కొని, ఉసిరి, నువ్వల మిశ్రమంతో నదీస్నానాలు ఆచరిస్తే శుభాలు కలుగు తాయని జ్యోతిష్యవాస్తు పండితులు నమిలికొండ రమణాచార్యులు తెలిపారు. తులసి చెట్టు వద్ద అఖండ దీపారాధన చేసి, శివకేశవులను దర్శించుకుంటే అనంత పుణ్యం సిద్ధిస్తుందన్నారు. దీపదానం చేయాలని కోరారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.)