TS Schools Reopening: తెలంగాణలో విద్యా సంవత్సరం షెడ్యూల్ ఖరారు..ఈ ఏడాది మొత్తం 229 పనిదినాలు
TS Schools Reopening: తెలంగాణలో విద్యా సంవత్సరం షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెలవులు పోగా మొత్తం 229పనిదినాలు స్కూళ్లు నడువనున్నాయి.
TS Schools Reopening: తెలంగాణలో విద్యా సంవత్సరం షెడ్యూల్ ఖరారైంది. 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ ఖరారు చేసింది. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమై, 2024 ఏప్రిల్ 24 చివరి పని దినంగా ప్రకటించింది. 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 తేదీ వరకూ వేసవి సెలవులుగా నిర్ణయించారు.

2023-24 ఏడాదిలో మొత్తం 229 పనిదినాలు ఉండనున్నాయి. జనవరి 10 తేదీ లోపు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో ప్రతీ రోజూ విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగ, ధ్యానం తరగతులు ఉంటాయన్నారు.
అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, డిసెంబర్ 22 నుంచి 26 తేదీ వరకూ క్రిస్మస్ సెలవులు ఉంటాయని ప్రకటించారు. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వారికి ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నో బ్యాగ్ డే…..
ఇకపై తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి నెల నాలుగో శనివారాన్ని నో బ్యాగ్ డేగా పాటించనున్నారు.ఆ రోజు పిల్లలు పుస్తకాల సంచి లేకుండా బడులకు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జారీ చేశారు. ఏడాదిలో మొత్తం 10 రోజులపాటు పిల్లలు సంచులు లేకుండా బడికి వస్తారు. ఆరోజు వారితో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై విడిగా మార్గదర్శకాలు జారీ చేస్తారు.
నిత్యం అరగంట పుస్తక పఠనం…
గతేడాది పాఠశాలలు తెరిచిన 16 రోజుల తరువాత అకడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. దీనిపై విమర్శలు రావడంతో ఈసారి పాఠశాలలు పునఃప్రారంభానికి వారం రోజులు ముందుగానే విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.
ప్రభుత్వ బడుల్లో టీవీ పాఠాలు యథావిధిగా ప్రసారం చేస్తారు. తరగతుల వారీగాటైమ్ టేబుల్‌ను సైట్ సంచాలకుడు త్వరలో ప్రకటిస్తారు. రోజూ 30 నిమిషాలపాటు విద్యార్ధులతో పుస్తకాలు చదివించాలి. అవి పాఠ్య, కథల పుస్తకాలు, దినపత్రికలు, మేగజీన్లు తదితరాలు కావొచ్చు.
ప్రతి రోజూ స్కూల్ అసెంబ్లీకి ముందు లేదా తర్వాత తరగతి గదిలో అయిదు నిమిషాలపాటు యోగా, ధ్యానం నిర్వహించాలని ఆదేశించారు. వారానికి 3- 5 పీరియడ్లు ఆటలకు కేటాయించాల్సి ఉంది. పదో తరగతి సిలబస్ 2024 జనవరి 10 నాటికి పూర్తి చేయాలి.
తెలంగాణలో గత ఏడాది దసరా సెలవులు గతేడాది 14 రోజులు ఉండగా ఈసారి 13 రోజులే ఇచ్చారు. క్రిస్మస్ సెలవులు కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించారు.
తెలంగాణలో సెలవు రోజులు ఇవే…
దసరా సెలవులను అక్టోబరు 13 నుంచి 25 వరకు, క్రిస్మస్ సెలవులు: డిసెంబరు 22 నుంచి 26 వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులను 2024 జనవరి 12 నుంచి 17 వరకు ఇస్తారు.
ప్రతి నెల మూడో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాల్సి ఉంటుంది. 2024 ఏప్రిల్ 23న చివరి పనిదినంగా నిర్ణయించారు.
ఏడాది జూన్‌లో 16 రోజులు, జులైలో 23 రోజులు, ఆగస్టులో 25రోజులు , సెప్టెంబరులో 22 రోజులు, అక్టోబరులో 14రోజులు, నవంబరులో 24రోజులు, డిసెంబరులో 23రోజులు, జనవరిలో 20రోజులు, ఫిబ్రవరిలో 24రోజులు, మార్చిలో 23రోజులు, ఏప్రిల్‌లో 15 రోజులు బడులు నడుస్తాయి.