TGSRTC Special Buses : 'కార్తీక మాసం' స్పెషల్ - అరుణాచలానికి TGSRTC ప్రత్యేక టూర్ ప్యాకేజీలు, ఇవిగో వివరాలు
కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ప్రకటించింది. అరుణాచలం, పంచారామాలకు వెళ్లేందుకు ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ వివరాలను వెల్లడించారు. అరుణాచలం వెళ్లేందుకు 10 ప్రాంతాల నుంచి బస్సులు నడవనున్నాయి.
పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జానర్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట, తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించారు.
ఆర్టీసీ పనితీరు, కార్తీకమాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి శనివారం వర్చ్‌వల్‌గా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీకి కార్తీక మాసం, శబరిమల ఆపరేషన్స్ ఎంతో కీలకమని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆది, సోమవారాలు శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని... అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవాలన్నారు. మరిన్నీ వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు.
నవంబర్ 16 వరకు అరుణాచలం బస్సులు:
అరుణాచలానికి నవంబర్ 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులు ఉండనున్నాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ నుంచి అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది. ఈ యాత్రలో భాగంగా కాణిపాకం వినాయకుడు, శ్రీపురం మహాలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకుంటారు.
తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ:
కార్తీక మాసం వేళ తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలం వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. HYDERABAD - ARUNACHALAM' పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చింది. నాలుగు రోజుల పాటు ట్రిప్ ఉంటుంది.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు. ఈ నవంబర్ నెలలో చూస్తే 13వ తేదీన జర్నీ ఉంది. https://tourism.telangana.gov.in/toursList? వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 8000గా ఉంది. చిన్నారులకు రూ. 6400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లోనే పేమెంట్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం