TGSRTC Karthika Masam : శైవ క్షేత్రాలకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు-అద్దెకు తీసుకునే ఆర్టీసీ బస్సు ఛార్జీల తగ్గింపు
TGSRTC Karthika Masam Special : కార్తీక మాసం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అలాగే అరుణాచలం, పంచారామాలకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది.
కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట, ఇతర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ పనితీరు, కార్తీకమాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి శనివారం వర్చ్‌వల్‌గా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ నిర్వహించారు.
ఆర్టీసీకి కార్తీక మాసం, శబరిమల ఆపరేషన్స్ ఎంతో కీలకమని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సజ్జనార్ దిశా నిర్దేశం చేశారు. ఆది, సోమవారాలు శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు.
ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవాలన్నారు. మరిన్నీ వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు.
బస్ ఆన్ కాంట్రాక్ట్(బీవోసీ) ఛార్జీలు తగ్గింపు
అద్దెకు తీసుకునే ఆర్టీసీ బస్సుల ఛార్జీలను తగ్గించినట్లు సజ్జనార్ తెలిపారు. పల్లె వెలుగు కిలోమీటర్‌కు రూ.11, ఎక్స్ ప్రెస్ రూ.7, డీలక్స్ రూ.8, సూపర్ లగ్జరీ రూ.6, రాజధాని రూ.7 మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. శబరిమలకు, శుభముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులను బుకింగ్ చేసుకుని.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు
తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రమైన కురుమూర్తి స్వామి జాతరకు వెళ్లే భక్తులకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోంది. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం ఈ నెల 8వ తేదీన ఉండగా.. 7 నుంచి 9వ తేది వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి ఆర్టీసీ అందుబాటులో ఉంచుతోంది. ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘర్, మహబూబ్‌నగర్ మీదుగా జాతరకు వెళ్తాయి. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను కల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు. ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకుని సురక్షితంగా కురుమూర్తి స్వామిని దర్శించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది.
సంబంధిత కథనం