TGSRTC Discount : విజయవాడ రూట్ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్ - టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్, ఇవిగో వివరాలు
TGSRTC Discount Offer: హైదరాబాద్ - విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రూట్‌లో ప్రయాణించే వారికోసం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

విజయవాడ రూట్‌లో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. లహారి- నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది.
ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని టీజీఆర్టీసీ కోరింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించింది.
బెంగళూరు రూట్ లో కూడా ఆఫర్:
తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు కూడా టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల టికెట్ ధరలో 10 శాతం రాయితీని ప్రకటించింది. బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ జర్నీలకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రూట్ లో టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించింది.
ఈ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు:
మహా శివరాత్రి వేళ భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇదే విషయంపై ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…. సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రముఖ శైవ క్షేత్రాలైన వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తిలకు వెళ్ళే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులు నడిపించాలని అధికారులను ఆదేశించారు. బస్సు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
శ్రీశైలానికి ఏపీఆర్టీసీ బస్సులు:
మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు లక్షలాది మంది తరలివస్తారు. ప్రయాణికులు, భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 28 వరకు బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా రోజుల్లో శివ దీక్షాపరులకు 19 నుంచి 23 వరకు స్పర్శ దర్శనం కల్పిస్తారు. అలాగే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
సంబంధిత కథనం