హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. నేటి నుంచే అమల్లోకి..!-tgsrtc bus fare hike in hyderabad effect from today check extra charge details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. నేటి నుంచే అమల్లోకి..!

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. నేటి నుంచే అమల్లోకి..!

Anand Sai HT Telugu

హైదరాబాద్, సికింద్రాబాద్‌ పరిధిలోని ఆర్టీసీ ప్రయాణికులకు ఇవాళ్టి నుంచి అదనపు ఛార్జీల భారం పడనుంది. ఇటీవలే టీజీఎస్ఆర్టీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో ఆర్టీసీ ఛార్జీల పెంపు

హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. ఈ మేరకు ఇటీవల నిర్ణయం తీసుకోగా.. ఇది ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో జంట నగరాల్లో ప్రయాణికులకు ఆర్టీసీ ప్రయాణం భారం కానుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ ఆర్డినరీ, ఎలక్ట్రిక్-ఎక్స్‌ప్రెస్ బస్సుల అన్నింటిలోనూ కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి.

మెుత్తానికి ఛార్జీలు రూ.5 నుంచి రూ.10 వరకు పెరగనున్నాయి. మెుదటి మూడు స్టేజీలకు రూ.5 రూపాయలు, 4వ స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మెుదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు అవుతుంది. సోమవారం అంటే నేటి నుంచే ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయి.

ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జీగా పిలిచే ఈ ఆదాయాన్ని అధికారుల ప్రకారం 2027 నాటికి ఔటర్ రింగ్ రోడ్ లోపల నడుస్తున్న 2,800 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయడానికి ఉపయోగిస్తారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన శక్తిని ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా విద్యుత్ వాహనాలకు మద్దతు ఇచ్చే సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీని ఆదేశించింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 25 టీజీఎస్ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వాటిలో ఆరు 265 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నాయి. ఈ సంవత్సరం మరో 275 బస్సులు అదనంగా వస్తాయి. TSSPDCL, TRANSCO సహాయంతో, ప్రతి డిపోకు రూ. 8 కోట్ల వ్యయంతో TGSRTC హై-టెన్షన్ (HT) కనెక్షన్ల ద్వారా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోంది.

రాబోయే ఎలక్ట్రిక్ బస్సులకు అనుగుణంగా 19 డిపోలలో హెచ్‌టీ ఛార్జింగ్ కనెక్షన్లు ఏర్పాటు అవుతాయి. కార్పొరేషన్ 10 కొత్త డిపోలు, 10 ఇంటర్మీడియట్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 392 కోట్లుగా అంచనా వేశారు.

అయితే మహాలక్ష్మీ పథకంతో ఫ్రీ బస్సు కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు బస్సు ఛార్జీల పెంపు చేశారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మెుత్తానికి తాజాగా అదనపు ఛార్జీల భారం లక్షలాది మంది ప్రయాణికులను ప్రభావితం చేస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.