విద్యుత్ వాడకం బిల్లలు, బకాయిల పేరుతొ కొంత మంది వ్యక్తులు కాల్ చేస్తూ డబ్బులు లాగే పని చేస్తున్నారని TGSPDCL హెచ్చరించింది. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సందేశాలు, ఫోన్ల ద్వారా సంప్రదించి…. విద్యుత్ బిల్లులు, వాటి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని అవి వెంటనే కట్టకుంటే రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సంస్థ చైర్మన్ ముషారఫ్ ఫరూఖి ఓ ప్రకటనలో తెలిపారు.
అపరిచత వ్యక్తులు పంపే మెసేజ్ ను నమ్మి బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డు వివరాలను చెప్పవద్దని సూచించారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత మెసేజ్ లు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. TGSPDCL పంపే సందేశాల్లో విభాగం పేరు, USC/సర్వీస్ నంబర్, వినియోగదారుని పేరు, బిల్లు వివరాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. TGSPDCL ఎప్పుడూ మొబైల్ నెంబర్ నుంచి సందేశాలు పంపదని స్పష్టం చేశారు.
టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు చెల్లింపు రసీదు తప్ప…. బ్యాంక్ ఖాతా/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ వివరాలను ఎప్పుడూ సేకరించరని వివరించారు. బిల్లుల చెల్లింపు కోసం సందేశం ద్వారా ఎటువంటి వెబ్‌సైట్ లింక్‌లను పంపదన్నారు. వినియోగదారులు సంస్థ వెబ్‌సైట్ www.tgsouthernpower.org లేదా TGSPDCL మొబైల్ యాప్ ద్వారా ప్రస్తుత వినియోగ బిల్లులు మరియు బకాయిల సమాచారాన్ని పొందవచ్చని సూచించారు.
విద్యుత్ వినియోగదారులు బ్యాంక్ ఖాతా/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం అనుమానాస్పద లింక్‌లను అనుసరించవద్దని కోరారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.