Current Bill Payment : గుడ్ న్యూస్.... UPI చెల్లింపులకు లైన్ క్లియర్..! మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు
TGSPDCL Bill Payment : విద్యుత్ బిల్లుల యూపీఐ చెల్లింపులకు అడ్డంకులు తొలిగాయి. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ భారత్ బిల్ పేమెంట్ సిస్టం(బీబీపీఎస్)లో చేరాయి. దీంతో యూపీఐ చెల్లింపులకు లైన్ క్లియర్ అయింది. టీజీఎస్పీడీసీఎల్ ఇప్పటికే ఫోన్ పే(Phone Pay) ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది.
TGSPDCL Bill Payment : విద్యుత్ వినియోగదారులకు కీలక అప్డేట్ వచ్చింది. మళ్లీ యూపీఐ పేమెంట్స్ ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. జులై 1 నుంచి ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి విద్యుత్ బిల్లులు చెల్లింపు ప్రక్రియలో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్‌ల ద్వారా చెల్లించడం నిలిపివేసినట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రకటన చేశాయి. దీంతో చాలా మంది వినియోగదారులు చెల్లింపుల విషయంలో కాస్త గందరగోళానికి గురయ్యారు. దీంతో పరిస్థితిని అంచనా వేసిన విద్యుత్ పంపిణీ సంస్థలు…. తిరిగి యూపీఐ చెల్లింపులను ప్రారంభించాయి.
కరెంట్ బిల్లుల చెల్లింపులను వేగంగా చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీసీపీడీసీఎల్‌లు భారత్ బిల్ పేమెంట్ సిస్టం(బీబీపీఎస్)లో చేరాయి. డిస్కంలు బీబీపీఎస్‌లోకి రావడంతో యూపీఐ సేవలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఫోన్ పే చెల్లింపులను పునరుద్ధరించినట్లు విద్యుత్ ఉన్నతాధికారులు ప్రకటించారు.
టీజీఎస్పీడీసీఎల్ ఇప్పటికే ఫోన్ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది. మిగతా సంస్థలతోనూ చర్చలు జరుపుతోంది. త్వరలోనే గూగుల్ పే తో పాటు మరిన్ని యూపీఏ పేమెంట్స్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యుత్ సంస్థల తాజా నిర్ణయంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వెబ్ సైట్ లోనూ చెల్లించవచ్చు….
కేవలం యూపీఐ మాత్రమే కాకుండా…. వినియోగదారులు TGSPDCL అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా బిల్లు కట్టుకోవచ్చు. హోం పేజీలోనే బిల్ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వివరాలను నమోదు చేసి సింపుల్ గా కరెంట్ బిల్లును క్లియర్ చేసుకోవచ్చు. కేవలం వెబ్ సైట్ మాత్రమే కాదు… యాప్ ను కూడా ఇన్ స్టాల్ చేసుకోని ఈ ప్రక్రియను కంప్లీట్ చేయవచ్చు.
మీ కరెంట్ బిల్లును ఇలా కట్టేయండి…..
- విద్యుత్ వినియోగదారుడు బిల్లు చెల్లించేందుకు ముందుగా https://tgsouthernpower.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో Pay Bill online అనే ఆప్షన్పై కనిపిస్తుంది. దీనిపై నొక్కాలి.
- ఇక్కడ మీరు ఉపయోగించే USC (Unique Service Number) నెంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ బటన్ పై నొక్కాలి.
- బిల్ కు సంబంధించిన వివరాలను డిస్ ప్లే అవుతాయి. ఆ తర్వాత Click Here to Pay అనే ఆప్షన్పై నొక్కాలి.
- ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో బిల్లు చెల్లించేందుకు రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఒక దానిని సెలక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిబెట్ కార్డు లేదా T Wallet వంటి ఆప్షన్లు ఉంటాయి. మీకు అనువుగా ఉన్న దానిని ఎంపిక చేసి బిల్ క్లియర్ చేసుకోవచ్చు.
ఇక వెబ్ సైట్ ద్వారానే కాకుండా… TGSPDCL యాప్ నుంచి కూడా ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం ముందుగా వినియోగదారుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి TGSPDCL యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ స్టాల్ అయ్యాక…. బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక వెబ్ సైట్, యాప్ ద్వారా కాకుండా… మీసేవా కేంద్రాలకు వెళ్లి కూడా పేమెంట్ చేయవచ్చు. ఇక మీకు దగ్గర్లోనే కరెంట్ ఆఫీస్ కేంద్రం ఉంటే అక్కడ కూడా పెండింగ్ బిల్లలను క్లియర్ చేయవచ్చు.
టాపిక్