TGSP Constables Protest : తెలంగాణ వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్ల నిరసనలు, డీజీపీ సీరియస్
TGSP Constables Protest : ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. నల్గొండలో పోలీసుల కుటుంబ సభ్యులతో అనుచితంగా ప్రవర్తించిన ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలపై డీజీపీ సీరియస్ అయ్యారు.
ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ తో తెలంగాణ వ్యాప్తంగా బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనకు దిగారు. ప్రధాన పట్టణాల్లో రోడ్లపైకి వచ్చి కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, కానిస్టేబుళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాలుగు రోజులు క్రితం కొంతమంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల భార్యలు... తమ భర్తలకు సెలవులు ఇవ్వడం లేదని ఆందోళన చేశారు. ఇందులో కానిస్టేబుళ్ల హస్తం ఉందని ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు... సస్పెండ్ అయిన కానిస్టేబుళ్లకు మద్దతుగా ఆందోళనకు దిగారు.
టీజీఎస్పీలో పనిచేస్తున్న పోలీసులకు కనీస సెలవులు ఇవ్వకుండా కుటుంబాలకు దూరం చేస్తున్నారని... పోలీస్ యూనిఫామ్ లలోనే నిరసనకు దిగారు. వరంగల్ జిల్లా మామునూరులో నాల్గవ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు. మామునూరు బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. నల్గొండ గ్రామీణ ఎస్‌ఐ సైదాబాబును సస్పెండ్ చేయాలని 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు నినాదాలు చేశారు. పోలీసుల కుటుంబ సభ్యులపై ఎస్ఐ సైదాబాబు దురుసుగా ప్రవర్తించారని కానిస్టేబుళ్లు నిరసనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు సాగర్ రోడ్డుపై నిరసనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
డీజీపీ సీరియస్
రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై డీజీపీ జితేందర్ స్పందించారు. క్రమక్షశిణకు మారుపేరైన పోలీస్ వ్యవస్థలో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ శనివారం కీలక ప్రకటన చేశారు. సెలవులపై పాత పద్ధతే అమలు చేస్తామని చెప్పినప్పటికీ కానిస్టేబుళ్లు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఈ ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందన్నారు. ఆందోళనలలో పాల్గొన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. తెలంగాణ రిక్రూట్‌మెంట్ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని డీజీపీ గుర్తుచేశారు.
ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్
బెటాలియన్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్ వివాదాస్పంద కావడంతో ప్రభుత్వం స్పందించి...కానిస్టేబుళ్లపై విధించి సస్పెన్షన్ ఎత్తివేసింది. అలాగే కానిస్టేబుళ్లకు సెలవులపై పాత విధానాన్నే అమలుచేస్తామని హామీ ఇచ్చింది. అయితే కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ధర్నా సమయంలో నల్గొండ రూరల్ ఎస్సై సైదాబాబు అనుచితంగా ప్రవర్తించారని, ఆయనను సస్పెండ్ చేయాలని అన్నేపర్తి 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు.
బెటాలియన్ లో బందోబస్తుకు వెళ్లిన ఎస్సై వైపు కానిస్టేబుళ్లు గుంపుగా రావడంతో... ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్సై కారు వైపుగా కానిస్టేబుళ్లు, కారుపై చేతులతో బలంగా కొట్టారు. నల్గొండలో మొదలైన ఈ వివాదం కరీంనగర్, వరంగల్‌లోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి.
ఏక్ పోలీస్ విధానం కోసం
బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ధర్నా సమయంలో ఎస్సై సైదాబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై కానిస్టేబుళ్ల భార్యలతో మాట్లాడుతూ... అసలు టీజీఎస్పీ కానిస్టేబుళ్లను ఎవరూ పెళ్లి చేసుకోమన్నారని ఎస్సై అన్నారు. తమతో అసభ్యకరంగా మాట్లాడిన ఎస్సైను సస్పెండ్ చేయాలని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సెలవుల కోసం మొదలైన ధర్నా ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. ఈ వివాదంపై రోడ్లపైకి వచ్చిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులే పోలీసుపై తిరగబడ్డారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.
కేటీఆర్ ట్వీట్
దేశ చరిత్రలో అతి పెద్ద పోలీసుల తిరుగుబాటు ఇదే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు తమ హక్కుల కోసం చరిత్రలో తొలిసారిగా రోడ్డెక్కారన్నారు. నిన్నటి వరకు యూనిఫార్మ్ పోస్టుల్లో ఉన్నామని, నేరుగా ఆందోళన చేయొద్దు అని తమ కుటుంబాలతో సమస్య విన్నవించే ప్రయత్నం చేశారన్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అరెస్టులు, బెదిరింపులతో
ఆడబిడ్డలని కూడా చూడకుండా లాగిపడేసి, నిర్బంధిస్తుండటంతో ఇక గత్యంతరం లేక కానిస్టేబుళ్లే ప్రత్యక్ష ఆందోళనకు దిగారన్నారు.
సంబంధిత కథనం