TGPSC: టీజీపీఎస్సీ నుంచి కీలక అప్‌డేట్.. త్వరలోనే గురుకుల పీఈటీ ఫలితాలు-tgpsc will release the gurukulam pet results soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc: టీజీపీఎస్సీ నుంచి కీలక అప్‌డేట్.. త్వరలోనే గురుకుల పీఈటీ ఫలితాలు

TGPSC: టీజీపీఎస్సీ నుంచి కీలక అప్‌డేట్.. త్వరలోనే గురుకుల పీఈటీ ఫలితాలు

Basani Shiva Kumar HT Telugu
Aug 20, 2024 01:18 PM IST

TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. గురుకుల పీఈటీ ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. మొత్తం 616 పోస్టుల ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. ఈ ఫలితాల కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు వేచి చూస్తున్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్
తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్

సంక్షేమ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ త్వరలోనే ప్రకటించనుంది. 2017లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి రాత పరీక్షలు పూర్తయ్యాయి. కానీ.. విద్యార్హతలు, సాంకేతిక కారణాలతో న్యాయ వివాదాలు తలెత్తాయి. ఆ వివాదాలన్నింటినీ కమిషన్ పరిష్కరించింది. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను ప్రకటించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందే అభ్యర్థుల నుంచి సొసైటీల వారీగా ఆప్షన్లు తీసుకుంది. ఆ ఆప్షన్ల ప్రకారం.. తుది ఫలితాలు వెల్లడించనుంది. దీంట్లో మైనార్టీ గురుకులాల్లో 194, ఎస్సీ గురుకులాల్లో 182, బీసీ గురుకులాల్లో 135, గిరిజన గురుకుల సొసైటీలో 83, సాధారణ గురుకులాల్లో 22 పోస్టులు ఉన్నాయి.

ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియ కూడా తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా న్యాయ వివాదాలతో పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు కూడా త్వరలో వెల్లడించడానికి కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురుకుల సొసైటీ నియామకాల్లో జరిగిన పొరపాట్లు.. ఇతర నోటిఫికేషన్లలో తలెత్తకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందే న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. తరుచూ వివాదాలు తలెత్తితే.. కమిషన్ ప్రతిష్ట దెబ్బతింటోంది. అందుకే పోరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభ వేదికగా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దానికి సంబంధించిన వివరాలను అసెంబ్లీలో వెల్లడించారు. నోటిఫికేషన్‌ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలను వివరించారుయ ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. గ్రూప్‌-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్‌-2ను డిసెంబరులో, గ్రూప్‌-3 నవంబరులో జరగనున్నాయి. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇస్తారు. ఆగస్టులో పరీక్షలు ఉంటాయి.

వైద్యారోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీ కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. నవంబర్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిభ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. ఈ ఎగ్జామ్స్ మేలో జరగనున్నాయి. అయితే.. ఈ పోస్టుల సంఖ్యను మాత్రం ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రభుత్వ నిర్ణయంతో.. ఇటు టీజీపీఎస్సీ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలు సేకరించే పనిలోపడ్డారు. పోస్టుల ఖాళీల వివరాలు సేకరించి.. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.