గ్రూప్‌ 1 నియామకాలపై డివిజన్‌ బెంచ్‌లో టీజీపీఎస్సీ పిటిషన్‌,నేడు విచారణ.. గ్రూప్‌1 పిటిషనర్లకు రూ.20వేల జరిమానా-tgpsc petition in division bench on group 1 recruitment hearing today rs 20 thousand fine for group 1 petitioners ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  గ్రూప్‌ 1 నియామకాలపై డివిజన్‌ బెంచ్‌లో టీజీపీఎస్సీ పిటిషన్‌,నేడు విచారణ.. గ్రూప్‌1 పిటిషనర్లకు రూ.20వేల జరిమానా

గ్రూప్‌ 1 నియామకాలపై డివిజన్‌ బెంచ్‌లో టీజీపీఎస్సీ పిటిషన్‌,నేడు విచారణ.. గ్రూప్‌1 పిటిషనర్లకు రూ.20వేల జరిమానా

Sarath Chandra.B HT Telugu

తెలంగాణ గ్రూప్‌ 1 నియిమాకాలకు అనుమతించాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను టీజీపీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా నియామకాలకు అనుమతించాలని కోరింది. మరోవైపు తప్పుడు పత్రాలతో గ్రూప్‌ 1నియామకాలపై పిటిషన్‌ వేసిన వారికి రూ.20వేల జరిమానాతో పాటు పిటిషనర్లపై విచారణకు ఆదేశించారు.

గ్రూప్‌ 1 నియామకాలపై నేడు హైకోర్టులో విచారణ

తెలంగాణ గ్రూప్‌ 1నియామకాలపై హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్రూప్‌ 1 ఇంటర్వ్యూల్లో నెగ్గిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. నియామక ప్రక్రియ నిలిపివేయాలని 20మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ కొనసాగించవచ్చని, తుది తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు సింగల్ బెంచ్‌ ఆదేశాలపై టీజీపీఎస్సీ డివిజన్‌ బెంచ్‌లో సవాలు చేసింది. గ్రూపు-1 నియామకాలను పూర్తి చేయడంపై ఏప్రిల్ 17న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచిలో అప్పీలు చేసింది. దీనిపై నేడు సీజే విచారణ జరుపనున్నారు.

గ్రూప్‌1 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని, నియామక ప్రక్రియ ముగింపు దశలో ఉండగా సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నట్టు పిటిషన్‌ లో టీజీపీఎస్సీ పేర్కొంది.

గ్రూప్‌ 1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ 20 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ నియామకాలను ఖరారు చేయరాదంటూ ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరగలేదని, పరీక్షా కేంద్రాల తనిఖీ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించామని.. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష కేంద్రాలను జిల్లా అధికారులే సిఫార్సు చేశారని కోర్టుకు వివరించారు.

గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజి గిరి జిల్లాల్లో జరిగాయి. మొదట 45 సెంటర్లను గుర్తించి తరువాత అభ్యర్థుల నిష్పత్తి, సౌకర్యాల ఆధారంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.

పరీక్షలు పూర్తయ్యాక సూపరింటెండెంట్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా21,075 మంది హాజరైనట్టు ప్రకటించారని, ఆ తర్వాత ఉపయోగించిన, ఉపయోగించని జవాబు పత్రాలు, ఓఎంఆర్, నామినల్ రోల్స్ అన్నీ తనిఖీ చేసి 21,085 మంది పరీక్షలు రాసినట్టు ప్రకటించినట్టు టీజీపీఎస్సీ పేర్కొంది. ఈ పిటిషన్‌పై నేడు సీజే ధర్మాసం విచారణ చేపట్టనుంది.

గ్రూప్‌ 1 పిటిషనర్లకు జరిమానా, ప్రాసిక్యూషన్

తెలంగాణ గ్రూపు-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు హైకోర్టు ధర్మాసనం రూ.20 వేల జరిమానా విధించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన పిటిషనర్లపై విచారణ చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది.

గత అక్టోబ రులో నిర్వహించిన గ్రూపు-1 మెయిన్ పరీక్షల్లో మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి అనుసరించిన విధానం సరిగాలేదని.. రీవాల్యుయేషన్ చేసి పారదర్శ కంగా ఫలితాలు వెల్లడించేలా టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీచేయాలంటూ కె. ముత్తయ్య, మరో 18 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తాజాగా పిటిషనర్లు తప్పుడు పత్రాలతో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలియడంతో జస్టిస్ నగేశ్ భీమపాక జరిమానా విధించారు.

ఆర్టికల్ 226 కింద పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం లభించదని పిటిషన్ కొట్టి వేస్తున్నట్టు ప్రకటిచారు. పిటిషనర్లు రూ.20 వేలు జరిమానాను హైకోర్టు న్యాయమూర్తుల కోర్టు మాస్టర్స్. పర్సనల్ సెక్రటరీస్ అసోసియేషన్కు చెల్లించాలని పిటిషనర్లను ఆదేశించారు. తప్పుడు వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేసిన పిటిషనర్లపై తగిన చర్యలు చేపట్టాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌ను జస్టిస్ నగేష్‌ ఆదేశించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం