TGPSC : నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అప్డేట్-మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు, పది రోజుల్లో గ్రూప్ పరీక్షల ఫలితాలు
TGPSC Job Notifications : కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లపై టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించింది. వారం, పది రోజుల వ్యవధిలో గ్రూప్-1,2, 3 ఫలితాలు రిలీజ్ చేస్తామని పేర్కొంది.
TGPSC Job Notifications : నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కమిషన్ తెలిపింది. ఖాళీల సమాచారం అందగానే ఏప్రిల్ లో నోటిఫికేషన్ల ప్రకటనపై కసరత్తు చేస్తామని టీజీపీఎస్పీ పేర్కొంది. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 6 నుంచి 8 నెలల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని కమిషన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
పరీక్ష ఫలితాలు ఎలాంటి ఆలస్యం లేకుండా విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. వారం, పది రోజుల వ్యవధిలో గ్రూప్-1,2, 3 ఫలితాలు రిలీజ్ చేస్తామన్నారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ ఫార్మాట్ లలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
మార్చి 31లోపు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు విడుదల చేస్తా్మన్నారు. ఏ పరీక్ష ఫలితాలు కంప్లీట్ అయితే అవి ముందుగా ఇచ్చేస్తామన్నారు. గతంలో మాదిరిగా ఫలితాల విడుదలలో జాప్యం చేయకుండా త్వరగా ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. టీజీపీఎస్సీ సిలబస్ పై అధ్యయనం చేస్తున్నామన్నారు. గ్రూప్ -3కు మూడు, నాలుగు పేపర్లు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ తరహాలో పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నామన్నారు.
యూపీఎస్సీ ప్రతి ఏటా 5 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. ఉద్యోగాలను బట్టి కంప్యూటర్ బేస్డ్, మ్యానువల్ గా పరీక్షలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. ఇకపై పరీక్ష పత్రాల విధానం మారుస్తామని, ముందుగా క్వశన్ బ్యాంకు తయారు చేసి, వాటి నుంచి ప్రశ్నాపత్రాలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఒక్కొ సబ్జెక్టులో 5 నుంచి 10 వేల వరకు బిట్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తామని స్పష్టంచేశారు. మార్చి 31 లోపల ఖాళీల జాబితా ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. మే 1 నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. ఇంటర్య్వూలు ఉండే ఉద్యోగాలకు సంవత్సరంలో, ఇంటర్వ్యూ లేని పోస్టులకు 6 నుంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.