TG Group 4 Update : గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్, ప్రజా విజయోత్సవాల్లో నియామక పత్రాలు అందజేత
TG Group 4 Update : తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు నిర్వహించే ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.
గ్రూప్-4 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు నిర్వహించే ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 8180 గ్రూప్-4 పోస్టులకు గతేడాది జులైలో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టులో సర్టిఫికెట వెరిఫికేషన్ నిర్వహించారు. అయితే తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజా ప్రకటనతో గ్రూప్-4 అభ్యర్థులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం తెలిపారు. ప్రజా విజయోత్సవాలు ఎలా నిర్వహించాలని, ఏ అంశాలపై ప్రచారం చేయాలి, వాటి విధివిధానాలు రూపొందించేందుకు భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం అయ్యింది. విజయోత్సవాల నిర్వహణపై శనివారం కేబినెట్ సబ్‌కమిటీ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
జవహర్‌లాల్ నెహ్రూ జయంతి నవంబర్ 14న ప్రజా విజయోత్సవాలు ప్రారంభించి, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 14 వరకు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ విజయోత్సవాల్లో భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 25 రోజుల పాటు వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టునున్నట్లు చెప్పారు. వచ్చే నాలుగేళ్లు రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామానా విజయోత్సవ సంబరాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం తెలిపారు.
ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో ఉస్మానియా ఆసుపత్రి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నామన్నారు. అలాగే 28న పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీ ప్రారంభిస్తామన్నారు. ఉత్సవాల్లో భాగంగా పలు కంపెనీలతో ఒప్పందాలు కూడా ఉంటాయన్నారు. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో భారీగా ప్రజా విజయోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తామన్నారు.
గత పది నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందుకుగాను తెలంగాణ వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. దాదాపు రూ. 18 వేల కోట్ల రైతు రుణాల మాఫీ చేయడంతో పాటు, మహిళా సంఘాలకు రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందచేశామన్నారు. డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలతో భారీ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
సంబంధిత కథనం