హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు​ చుట్టూ ఇసుక బజార్లు.. బుక్ చేసుకున్న 48 గంటల్లోనే డెలివరీ-tgmdc established the sand points around hyderabad orr and supply within 48 hours ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు​ చుట్టూ ఇసుక బజార్లు.. బుక్ చేసుకున్న 48 గంటల్లోనే డెలివరీ

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు​ చుట్టూ ఇసుక బజార్లు.. బుక్ చేసుకున్న 48 గంటల్లోనే డెలివరీ

తెలంగాణలో నిర్మాణాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో భారీగా భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో ఇసుకకు డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా దళారులు డబ్బులు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీజీఎండీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రింగ్ రోడ్డు చుట్టూ ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది.

ఇసుక సరఫరా (unsplash)

హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో.. భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అటు సాధారణ ప్రజలు కూడా ఇండ్లు కట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తక్కువ ధరకే త్వరగా ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందరికీ అందుబాటులో ఉండేలా టీజీఎండీసీ చర్యలు చేపట్టింది.

దందాకు చెక్ పెట్టేందుకు..

ప్రస్తుతం ఇసుకకు డిమాండ్ బాగా ఉంది. దీంతో కొందరు వ్యాపారులు, దళారులు టన్నుకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టేందుకు టీజీఎండీసీ ఇసుక బజార్​లను ఏర్పాటు చేసింది. బడా రియల్టర్ల నుంచి సామాన్య ప్రజల వరకు ఇసుకను తక్కువ ధరకు అందించేందుకు ఇసుక బజార్లను అందుబాటులోకి తెచ్చింది. ఇసుక కావాలనుకునేవారు ఫోన్​ చేస్తే.. 48 గంటల్లోనే డెలివరీ చేస్తామని టీజీఎండీసీ అధికారులు చెబుతున్నారు.

4 చోట్ల ప్రారంభం..

15 రోజుల కిందటే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నాలుగు ఇసుక బజార్లను టీజీఎండీసీ ప్రారంభించింది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం 1,78,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఇక్కడ నుంచి కొనుగోలు చేసేందుకు బిల్డర్లు, ప్రజలు ఆస్తకి చూపుతున్నారు. గతంలో ఇసుకను వేరే జిల్లాల నుంచి లారీల్లో తెప్పించుకునేవారు. డిమాండ్​ను బట్టి వ్యాపారులు ధరలు పెంచేవారు. ప్రస్తుతం ఇసుకబజార్లు అందుబాటులోకి రావడంతో.. ఖర్చులు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

ప్రస్తుతం ఓఆర్ఆర్ చుట్టూ బౌరంపేట, అబ్దుల్లాపూర్​మెట్, వట్టినాగులపల్లి, ఆదిబట్లలో నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించారు. అబ్దుల్లాపూర్ మెట్ 5 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. వట్టినాగులపల్లిలోనూ 5 ఎకరాల్లో ఉంది. బౌరంపేటలో 8 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఆదిబట్లలో 5 ఎకరాల్లో ఉంది. శామీర్‌పేట్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఇసుక బజార్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

48 గంటల్లో డెలివరీ..

ప్రస్తుతం ఉన్న 4 ఇసుక బజార్లకు కొత్తగూడెం, నల్గొండ రీచ్‌ల నుంచి తెప్పిస్తున్నారు. ఇసుక కావాలంటే.. టీజీఎండీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్​ చేసుకోవచ్చు. రీచ్ నుంచి వచ్చే దూరాన్ని బట్టి వాహనాలకు అద్దె చెల్లించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బుక్ చేసుకున్న 48 గంటల్లోగా ఇసుకను ఇంటికి పంపిస్తామని అంటున్నారు. మొత్తానికి ఇసుక బజార్ల ఆలోచన కొత్తగా.. సౌకర్యవంతంగా ఉందని.. నిర్మాణదారులు చెబుతున్నారు.

సంబంధిత కథనం