TG TET Notification : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల, ఈ నెల 5 నుంచి దరఖాస్తులు ప్రారంభం
TG TET Notification : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2025 జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
TG TET Notification : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు ఆన్ లైన్ లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏడాది రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
జనవరిలో పరీక్షలు
తెలంగాణ టెట్ నోటిఫికేషన్(TG TET Notification)ను సోమవారం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిది. ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది. ఈ మేరకు మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలకు సుమారు 2.35 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలు రాసిన వారిలో 1.09 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యారు. తాజాగా రెండో టెట్‌కు నవంబర్ లో నోటిఫికేషన్ జారీ 2025 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని... ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏడాదిలోపే రెండో టెట్
తెలంగాణ టెట్ పేపర్- 1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా ఉన్న వారు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేం దుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పెద్ద సంఖ్యలో టెట్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఉపాధ్యాయ నియమాకాలకు టెట్ పరీక్షను అమలు చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఈ పరీక్షలు నిర్వహించారు. వచ్చే జనవరిలో పదోసారి టెట్ జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల కోసం నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ సోమవారం విడుదల చేశారు. 2024 టెట్ పరీక్షల్లో మొత్తం 1,87,256 మంది ఉత్తీర్ణులయ్యారు.
పేపర్ 1ఏ తెలుగు, మైనర్ మీడియా సబ్జెక్టుకు 1,60,017మంది హాజరైతే 1,04,785మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం హాజరైన వారిలో 65.48శాతం ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 1 బిలో ఎస్జీటీ స్పెషల్ స్కూల్స్ పేపర్‌లో 2173మంది హాజరైతే వారిలో 767మంది అర్హత సాధించారు. 35.3 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 2ఏలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పరీక్షకు 55781 మంది హాజరైతే 22,080మంది ఉత్తీర్ణులయ్యారు. 39.58శాతం మంది అర్హత సాధించారు. పేపర్ 2ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, సైన్స్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో 88290మంది హాజరైతే 33525మంది అర్హత సాధించారు. 37.97శాతం మంది క్వాలిఫై అయ్యారు.
పేపర్ 2ఏ స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు 60442మంది హాజరైతే 24472మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం హాజరైన వారిలో 40.49శాతం అర్హత పొందారు. పేపర్ 2బి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్కూల్స్‌కు 1958మంది హాజరైతే 1627మంది అర్హత సాధించారు. మొత్తం 83.09మంది క్వాలిఫై అయ్యారు. ఏపీ టెట్ 2024 పరీక్షలకు మొత్తం 3,68,661మంది హాజరయ్యారు. వారిలో 1,87,256మంది క్వాలిఫై అయ్యారు. 50.79శాతం మందికి అర్హత పొందారు.
సంబంధిత కథనం