Rythu Bharosa : రైతు భరోసాపై బిగ్ అప్డేట్, ఖాతాల్లో డబ్బులు పడేది అప్పుడే
Rythu Bharosa : రైతు భరోసాపై మరో బిగ్ అప్డేట్ వచ్చింది. రేపు లేదా ఎల్లుండి రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో వేయనున్నారు. గతంలో మాదిరిగా ఎకరాల చొప్పున విడతల వారీగా రైతు భరోసా నిధులు జమచేయనున్నారు.

Rythu Bharosa : తెలంగాణ రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయి. పెట్టుబడిసాయం కింద రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.12 వేలు రెండు విడతల్లో జమచేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎకరా భూమి ఉన్న రైతులకు తొలి విడత రైతు భరోసా నిధులను జమచేశారు.
తాజాగా రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు రేపు లేదా ఎల్లుండి రైతు భరోసా నిధులు జమచేయనున్నారు. ఇప్పటికే ఎకరా వరకు భూమి ఉన్న రైతులకు రూ.6 వేల చొప్పున డబ్బులు వేశారు. గతంలో లాగా ఎకరా, రెండు ఎకరాలు, మూడు ఎకరాల చొప్పున విడతల వారీగా రైతు భరోసా సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఎకరం వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు వేసింది. రైతుభరోసా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 32 జిల్లాల్లోని 21.45 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.1,126.54 కోట్ల నిధులు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలోని 1.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.88.48 కోట్ల నిధులు వేశారు.
నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో
ఫిబ్రవరి తొలివారంలో ప్రతి గ్రామానికి షెడ్యూల్ వేసి, వచ్చేనెల 31 వరకు అన్ని గ్రామాల్లోనూ ఇటీవల ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఒక్కో గ్రామంలో పథకం అమలు అంత తేలికగా కాదని అధికారులు భావిస్తున్నారు. దీంతో నాలుగు పథకాల్లో తొలుత నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సర్కార్ నిర్ణయించింది.
రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అర్హుల డేటా స్పష్టంగా ఉందని సమాచారం. రాష్ట్రంలో సాగుకు పనికిరాని భూములు రెండున్నర లక్షల ఎకరాలుగా అధికారులు గుర్తించారు. ఆ సర్వే నెంబర్లను బ్లాక్ చేశారు. అనంతరం మిగిలిన కోటి 50 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు.
ఎకరాల చొప్పున నిధులు
ఒక్కో గ్రామానికి కాకుండా గతంలో చెల్లించినట్లుగానే ఎకరాల చొప్పున విడతల వారీగా రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఒక ఎకరా వరకు ఉన్న సుమారు 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులను జమ చేశారు. రేపు లేదా ఎల్లుండి రెండు ఎకరాల వరకు భూమి ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు జమచేయనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూములు లేని వ్యవసాయ కూలీల లెక్కలను ప్రభుత్వం తేల్చింది. వారి బ్యాంక్ ఖాతాల ఏక కాలంలో నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందిరమ్మ ఇండ్లపై
రేషన్ కార్డుల ప్రక్రియ సైతం కొనసాగుతోంది. ప్రజాపాలన, గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను కంప్యూటీకరిస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనూ లబ్ధిదారుల గుర్తింపు దాదాపుగా పూర్తయింది. తొలి విడతలో నాలుగున్నర లక్షల మంది లబ్దిదారులను ఫైనల్ చేసేందుకు త్వరలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అర్హుల జాబితా ఫైనల్ అయితే లబ్దిదారుల ఖాతాల్లో తొలివిడతగా రూ.లక్ష చొప్పన వేస్తారు.
సంబంధిత కథనం