TG Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. 'రాజీవ్ యువ వికాసం' పథకం గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4తో దరఖాస్తులు ముగియనున్నాయి. పలువురి విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ పథకంలో భాగంగా 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల రుణాలను 60-80 శాతం సబ్సిడీతో ఇవ్వనున్నారు. రేషన్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, ఫొటోతో https://tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తుంది. తాజాగా దరఖాస్తుల గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించారు. ఈ స్కీమ్ అమలు తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతి కుమారి, పలువురు కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా సబ్సిడీపై రుణాలను మూడు క్యాటగిరీలుగా విభజించింది. క్యాటగిరీ-1 కింద రూ.లక్ష వరకు రుణం అందిస్తుండగా, ఇందులో 80 శాతం రాయితీ ఇస్తారు. క్యాటగిరీ-2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తుండగా, ఇందులో 70 శాతం రాయితీ కల్పిస్తారు. క్యాటగిరీ-3 కింద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలను అందిస్తారు. అందులో 60 శాతం రాయితీ కల్పిస్తారు.
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు రాయితీ రుణాలు మంజూరు చేస్తారు. రుణాల దరఖాస్తులకు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణసాయాన్ని అందిస్తామన్నారు. అయితే రూ. 50 వేల వరకు 100 శాతం రాయితీ కల్పిస్తున్నారు. రూ.1 లక్ష వరకు రుణానికి 80 రాయితీ కల్పిస్తారు.
సంబంధిత కథనం