Tirumala TG MP MLAs Letters : తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతి , సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Tirumala TG MP MLAs Letters : తిరుమల దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమతిపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
Tirumala TG MP MLAs Letters : తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమతిపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సీఎంతో చర్చించారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వారానికి నాలుగు సిఫార్సు లేఖలు అనుమతించేందుకు సీఎం అంగీకరించినట్లు బీఆర్ నాయుడు పేర్కొన్నారు. వారానికి రెండు బ్రేక్ దర్శనాలు, రెండు రూ.300 దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు అనుమతించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల దర్శనాల్లో ప్రాధాన్యం దక్కడంలేదని తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం దక్కడంలేదని ఇటీవల కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించాలని గత కొన్నిరోజులుగా డిమాండ్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... గతంలో తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో ఎలాంటి తేడా లేకుండా జరిగేవన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ భక్తులు, రాజకీయ నాయకులపై వివక్ష చూపుతున్నారన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గతంలో కల్పించిన సౌకర్యాలను పునరుద్ధరించాలని కోరారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు గద్వాల ప్రాంతం నుంచి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీగా ఉందన్న విషయం టీటీడీ అధికారులు గుర్తించాలన్నారు. తెలంగాణ వాసులకు ఆంధ్రాతో సంబంధం ఉన్న ఏకైక ప్రాంతం తిరుపతి అని, గతంలో మాదిరిగా తిరుమలలో తెలంగాణ నాయకుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నాయకుల నుంచి వస్తున్న డిమాండ్ లపై ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. టీటీడీ ఛైర్మన్ తో చర్చించి తెలంగాణ నాయకులు సిఫార్సు లేఖలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కియోస్క్ మిషన్లతో సులభతరంగా విరాళాలు
టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1 నుంచి రూ.లక్షలోపు సులభతరంగా విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్లు(సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్ లైన్ పేమెంట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మిషన్ల ద్వారా అన్న ప్రసాదం ట్రస్టుకు 50 రోజుల్లో రూ.55 లక్షలు విరాళం అందిందని టీటీడీ తెలిపింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయంలో కూడా ఈ మిషన్లు ప్రారంభించారు. ఈ మూడు ఆలయాల్లో ఈ మిషన్ల ద్వారా 15 రోజుల్లో రూ.5 లక్షలు విరాళంగా అందిందని టీటీడీ అధికారులు తెలిపారు.
పేరూరు సమీపంలోని వకుళామాత ఆలయంలో కూడా ఈ కియోస్క్ మిషన్ ను టీటీడీ ప్రారంభించింది. మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులో తీసుకురానున్నారు. ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం ఉంది. త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది.
సంబంధిత కథనం