Ponnam Prabhakar: కుల గణన సర్వేలో పాల్గొనని వారికి కుల గణన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దేశంలోనే మార్గదర్శకంగా కులగణనను చేపట్టిందని తెలిపారు.
పారదర్శకంగా కులాల సంఖ్యను తేల్చి బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు రాంగ్ డైరెక్షన్ లో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీల నేతలకు కుల గణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం సమగ్ర సర్వేతో అన్ని కులాల సంఖ్య తేలిందని చెబుతున్న బిఆర్ఎస్ నేతలు ఎందుకు ఆ లెక్కలను బహిర్గతం చేయకుండా దాచి పెట్టారని ప్రశ్నించారు. బిజేపి కులగణనను వ్యతిరేకిస్తు అపిడపిట్ ధాఖలు చేసిందని విమర్శించారు. బిజేపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే చేతనైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేలా చూడాలని డిమాండ్ చేశారు. నిర్ణయం నుంచి నివేదిక దాకా నివేదిక నుంచి నిధుల దాకా ఎలా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
బీసీలకు న్యాయం చేసేందుకు మేదావులు, అన్ని కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎవ్వరు ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. బిసి లలో ముస్లీం మైనారిటీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని స్పష్టం చేశారు. బీసీలు ముస్లింలు కలిసి 56 శాతం అవుతున్నా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎస్సీలకు, ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరగనివ్వమని ప్రజా ప్రభుత్వం అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తుసుకుంటుందన్నారు.
అర్బన్ నక్సల్స్ పేరుతో ఒక సెక్షన్ ప్రజలను క్రిందకు నెట్టే ప్రయత్నం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్నాడని మంత్రి పొన్నం విమర్శించారు. ఎర్ర చొక్కా వెసుకున్న వాళ్ళంతా నక్సల్స్ అనడం సరైన పద్దతి కాదన్నారు. ప్రగతిశీల భావాలు కలిగిన తాను ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా ఎర్ర చొక్కా వేసుకున్నానని, అంత మాత్రాన నక్సలైట్ ను అవుతానా? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి భావాలు వారికి ఉంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో కొందరిని ఉద్దేశించి బండి సంజయ్ అర్బన్ నక్సల్స్ చేతిలో తెలంగాణ విద్యా వ్యవస్థ బందీ అయిందని విమర్శించడం సమంజసం కాదన్నారు. రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే వారి ఆలోచన మంచిది కాదన్నారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)