TG SC Classification : ఎస్సీ వర్గీకరణకు శాసనమండలి ఆమోదం, ఎస్సీలను గ్రూప్-1,2,3గా వర్గీకరించాలని సిఫారసు
TG SC Classification : ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది. కమిషన్ ఎస్సీలను గ్రూప్-1,2,3 గా వర్గీకరించాలని సూచించింది.
TG SC Classification : ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఎస్సీలలో 59 ఉప కులాలను గుర్తించినట్లు తెలిపింది. ఎస్సీలను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని కమిషన్ సిఫారసులు చేసింది. గ్రూప్-1లోని 15 ఉపకులాల జనాభా 3.288 శాతం కాగా వీరికి 1 శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ సూచించింది.

అలాగే గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉపకులాల జనాభా 62.748 శాతం కాగా వీరికి 9శాతం రిజర్వేషన్, గ్రూప్-3లోని ఎస్సీ 26 ఉపకులాల జనాభా 33.963 శాతం కాగా వీరికి 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని వర్గీకరణ కమిషన్ నివేదికలో పేర్కొంది. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది.
ఎస్సీ వర్గీకరణపై పోరాటాలు
తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అసెంబ్లీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీలో ఈ రెండు అంశాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణపై ఎప్పటి నుంచో మాదిగ, మాలలు పోరాటం చేస్తున్నారన్నారు.
దానికి అనుగూణంగానే కులవర్గీకరణ చేపట్టామన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు, కమిషన్ నివేదిక, సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. కులగణన, ఎస్సీ వర్ణీకరణ ద్వారా 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎస్సీల్లోని 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసింది. రాష్ట్రంలో మాదిగ జనాభా 32,33,642గా పేర్కొంటూ గ్రూప్-2 లో చేర్చింది. మాదిగతో పాటు చమర్, ముచి, చిందోల్లు, బైండ్ల కులాలు ఈ గ్రూపులో ఉన్నాయి.
రాష్ట్రంలో మాలల జనాభా 15,27,143గా ఉందని చెబుతూ వీరిని గ్రూప్-3లో చేర్చారు. గ్రూప్-1లో బుడ్గ జంగం, మన్నే, మాంగ్ కులాలు ఉన్నాయి.
ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది - సీఎం రేవంత్ రెడ్డి
అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ పోరాటం జరుగుతోందన్నారు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం తన ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఎంతోమంది సీఎంలకు రాని అవకాశం తనకు వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ రోజు ఆత్మ సంతృప్తి కలిగిందన్నారు. ఈ రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు.
వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపడానికి ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అతి తక్కువ సమయంలో సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేశామన్నారు. గతంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అడ్జర్న్ మోషన్ ఇస్తే తనను సభ నుంచి బయటకు పంపించారని, కానీ ఈనాడు సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకు సభలో నిర్ణయం తీసుకుంటున్నానన్నారు. ఈ నిర్ణయం అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే సాధ్యమైందన్నారు.
సంబంధిత కథనం