Indiramma Atmiya Bharosa: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, లబ్దిదారుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి
Indiramma Atmiya Bharosa : భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెలలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే అమలుపై రైతుల్లో అప్పుడే సందేహాలు మొదలయ్యాయి.
Indiramma Atmiya Bharosa : తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త ప్రథకానికి శ్రీకారం చుట్టునుంది. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభిస్తామని శనివారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ పథకంపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతు కూలీలకు ఏటా రెండు విడతల్లో రూ.12 వేలు ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. డిసెంబర్ 26న ఈ స్కీమ్ ప్రారంభిస్తామని చెప్పారు. అనుకోని కారణాలతో ఈ పథకం ప్రారంభం వాయిదా పడింది. కేబినెట్ లో నిర్ణయం అనంతరం జనవరి 26 నుంచి ఈ స్కీమ్ ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.
భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో తాను పాదయాత్ర చేసిన సమయంలో కౌలు రైతుల కష్టాలు తెలుసుకున్నానని, అందుకే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. అయితే ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఏ ప్రాతిపదికన రైతు కూలీలను గుర్తిస్తుంది. కేవలం రైతు కూలీలకే ఇస్తారా? కౌలు రైతులకు కూడా ఇస్తారా? ఒకేసారి ఇస్తారా? ఏడాది రెండుసార్లు ఇస్తారా? ఇలా అనేక రకాల అనుమానాలు రైతుల్లో మొదలయ్యాయి. ఇప్పటికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపైనే చర్చ మొదలైంది.
అప్పుడే చర్చలు మొదలు?
భూములున్న వారు...సేద్యం చేయలేక కౌలుకు ఇస్తుంటారు. కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సాయం ఇస్తే...ఆ భూములకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తారా? అనే అనుమానం రైతుల్లో వ్యక్తం అవుతోంది. భూమి లేని వ్యవసాయ కూలీలని ప్రభుత్వం ప్రకటించినా...వీరిని ఏ విధంగా గుర్తిస్తారో? విధివిధానాలపై చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వ ప్రకటన వ్యవసాయ కూలీలకు ఆనందం కలిగిస్తున్నా...కౌలుకు భూములిచ్చిన రైతులు మాత్రం ఆందోళనలో ఉన్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏ ప్రాతిపదికన ఇస్తారనేది దానిపై చర్చమొదలైంది. ముఖ్యంగా కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో? అని సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఒకే భూమికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుందా? రైతు భరోసా ఇస్తే కౌలు భరోసా నిలిచిపోతుందా? ఇలాంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూములన్న ఉన్న రైతులకు, భూమి లేని వ్యవసాయం చేసే రైతులకు రూ.12 వేలు ఇస్తే, ఈ పథకాలను కొందరు ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని కూడా చర్చలు మొదలయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఈ పథకంపై విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది. రైతుల సందేహాలను తీర్చే విధంగా, అన్ని విధాలుగా రైతులు, కౌలు రైతులను ఆదుకునేలా ఈ పథకం అమలు ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులై ఉండి, కూలిపనులకు వెళ్తున్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తారని మరో ప్రచారం జరుగుతోంది.
సంబంధిత కథనం