TG High Court On Venuswamy : నాగచైతన్య-శోభిత వివాహంపై వివాదాస్పద వ్యాఖ్యలు- వేణుస్వామికి హైకోర్టు షాక్, చర్యలకు ఆదేశం
TG High Court On Venuswamy : తెలంగాణ హైకోర్టు వేణుస్వామికి షాక్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్ ను ఎత్తివేసింది. నాగచైతన్య-శోభిత ధూళిపాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వేణుస్వామిపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ను ఆదేశించింది.
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితం సక్రమంగా ఉండదని జాతకం చెప్పిన వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగిన రోజునే వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి వైవాహిక బంధం మూడేళ్లలో ముగుస్తుందని జోస్యం చెప్పారు. మరో మహిళ ప్రమేయంతో 2027లో వీరు విడిపోతారని అంచనా వేశారు. నాగచైతన్య-శోభిత జాతకాలను వేణుస్వామి విశ్లేషించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై కొందరు జర్నలిస్టులు తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు.
మహిళా కమిషన్కు తనపై చర్యలు తీసుకునే అధికారం లేదంటూ హైకోర్టు వెళ్లి వేణుస్వామి స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై తాజాగా విచారించిన హైకోర్టు... గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్ ను ఎత్తివేసింది. వేణుస్వామిపై మహిళా కమిషన్ చర్యలు తీసుకునేందుకు పూర్తి అధికారాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల్లో వేణుస్వామిపై తగిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. వేణుస్వామిపై కమిషన్ ఏ చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తిగా మారింది.
వేణుస్వామి-వివాదాలు
ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి తరచూ వివాదాల్లో చిక్కుకోవడం పరిపాటి. రాజకీయ, సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన తరచూ మీడియాలో కనిపిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పి, అవి జరగకపోవడంతో పొలిటికల్ జోస్యాలకు దూరంగా ఉంటున్నారు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి జోస్యం చెబుతూ...వేణుస్వామి వివాదాల్లో నిలుస్తుంటారు. ఇటీవల నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలతో వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు.
ఈ ఏడాది ఆగస్టులో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు వేణుస్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద...వేణుస్వామి, ఆయన వీడియోలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానళ్లపై విచారణ చేస్తామని తెలిపారు. అనంతరం మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై వేణుస్వామి హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టు ఈ స్టే ఆర్డర్ ను ఎత్తివేసింది.
సంబంధిత కథనం