Welfare Schemes:రేపు మండలానికి ఒక గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం, మార్చి కల్లా ప్రక్రియ పూర్తి-భట్టి విక్రమార్క-tg govt starts four welfare schemes indiramma illu ration card rythu bharosa on jan 26th says bhatti vikramarka ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Welfare Schemes:రేపు మండలానికి ఒక గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం, మార్చి కల్లా ప్రక్రియ పూర్తి-భట్టి విక్రమార్క

Welfare Schemes:రేపు మండలానికి ఒక గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం, మార్చి కల్లా ప్రక్రియ పూర్తి-భట్టి విక్రమార్క

Bandaru Satyaprasad HT Telugu
Jan 25, 2025 05:40 PM IST

TG Four Welfare Scheme : మండలంలోని ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని రేపు నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తెలిపారు. ఇవాళ అప్లికేషన్ ఇచ్చినా అర్హులైతే రేపటి జాబితాలో పేరు ఉంటుందన్నారు. అనర్హులకు ఇల్లు వస్తే క్యాన్సిల్ చేస్తామన్నారు.

రేపు మండలానికి ఒక గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం, మార్చి కల్లా ప్రక్రియ
రేపు మండలానికి ఒక గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం, మార్చి కల్లా ప్రక్రియ

TG Four Welfare Scheme : ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు పథకాలను జనవరి 26న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. వీటికి సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. సచివాలయంలో మంత్రులతో కలిసి ఆయన శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

'ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు అప్లికేషన్లు స్వీకరించి అర్హులందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. గ్రామసభల్లో ఇండ్లు, రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున అప్లికేషన్ వస్తున్నాయి. ఈ అప్లికేషన్లను క్రోడికరించి, లబ్దిదారులను గుర్తిస్తారు. ఇచ్చిన మాట ప్రకారం జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు పథకాలు అమలు చేస్తున్నాం. మండలానికి ఒక గ్రామాన్ని శాచ్యురేషన్ మోడ్ గా తీసుకుని ఈ నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకూ ఈ పథకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తవుతుంది' అని అన్నారు.

"ఈ ప్రక్రియలో మా పేర్లు రాలేదు, మిస్ అయ్యాయని గ్రామస్థులు చెబుతున్నా కారణంగా కాస్త ఆలస్యం అవుతుంది. ఈ ప్రాసెస్ లో ఏ ఒక్కరూ మిగిలిపోరు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద...ఉపాధి హామీ పథకంలో రిజిస్టర్ చేసుకుని కనీసం 20 రోజులు పనిచేస్తే వాళ్లందరికీ ఈ పథకం కింద ఆర్థిక సాయం చేస్తాం. ఇది మహోన్నతమైన కార్యక్రమం. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ పాలన రుజువుచేస్తాం"- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రేషన్ కార్డుల జారీ నిరంత ప్రక్రియ- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రేపు మధ్యాహ్నం 1 గంటకు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని ఒక గ్రామంలో లాంఛింగ్ కార్యక్రమం ఏర్పాటుచేస్తున్నామన్నారు.

'మండంలోని ఒక గ్రామంలో లబ్దిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు అమలు అవుతాయి. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అర్హులైన ఇప్పటికైనా అప్లికేషన్ ఇస్తే రేషన్ కార్డు జారీ చేస్తాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఫుడ్ సెక్యురిటీ కల్పించడానికి పనిచేయలేదు.

పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు మంజూరు కాలేదు. అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తైన తర్వాత మనిషికి 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాం. పీడీఎస్ విధానంలో మంచి క్వాలిటీ సన్నం బియ్యం ఇవ్వనున్నాం. ఆహార భద్రత విషయంలో ఇదొక చారిత్రక నిర్ణయం' అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

రేపు రైతుల ఖాతాల్లో రూ.12 వేలు

"కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రైతులు అత్యధిక పంటలు పండించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే సుమారు రూ.40 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం. రుణమాఫీ కింద రూ.21 వేల కోట్లు, రైతు బీమా రూ.3 వేల కోట్ల ప్రీమియం కట్టాం. రబీ పంటకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు రేపటి నుంచి ఖాతాల్లో పడనున్నాయి. వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రూ.12 వేలు ఖాతాల్లో జమ చేస్తున్నాం. నేరుగా రైతుల ఖాతాల్లోనే రూ.40 వేల కోట్లు జమ చేశాం"- తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి

అనర్హులకు ఇల్లు వస్తే క్యాన్సిల్ చేస్తాం- మంత్రి పొంగులేటి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా...ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమం అందాలని నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అందరికీ రేపే పథకాలు ఇవ్వాలనుకున్నామని, కానీ గ్రామసభల్లో వస్తున్న అప్లికేషన్లను క్రోడికరించి అర్హులైన వారికి పథకాలు అందిస్తామన్నారు. రేపు ఒక గ్రామాన్ని మోడల్ గా ఎంచుకుని పథకాలు అమలుచేస్తున్నామన్నారు. గ్రామసభలు పెట్టినప్పుడు కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు.

'చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందిస్తాం. కొత్త అప్లికేషన్లు క్రోడీకరిస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేస్తాం. ఎప్పుడు ఏ పథకం అమలు చేస్తామో తెలియజేస్తాం. ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమంలో ఎక్కడా అవినీతికి తావులేకుండా...పేదలకు అందిస్తాం. రాష్ట్రంలోని 616 మండలాల్లో(హైదరాబాద్ మినహా) ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని రేపు నాలుగు స్కీమ్ అమలు చేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. నిన్న అప్లికేషన్ ఇచ్చిన వాళ్లు కూడా...అర్హులై ఉంటే రేపటి లిస్ట్ లో వారి పేరు ఉంటుంది. అర్హులు కానివారికి ఇందిరమ్మ ఇళ్లు వస్తే...వాటిని క్యాన్సిల్ చేస్తాం. అర్హుల కాని ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి'- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Whats_app_banner