TG Govt Schools : పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, రోజుకో రకం రుచికరమైన స్నాక్స్
TG Govt Schools : తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యా్ర్థులకు రుచికరమైన స్నాక్స్ అందిస్తోంది. పాస్ పర్సెంటేజ్ పెంచేందుకు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఇళ్లకు చేరుకునేటప్పటికి ఆలస్యం అవుతుండడంతో స్నాక్స్ అందిస్తున్నారు.
TG Govt Schools : తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే పదో విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. నేటి నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ అబిడ్స్‌లోని ప్రభుత్వ అలియా మోడల్ హై స్కూల్ లో పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ను అందించారు.

పాస్ పర్సెంటేజ్ పెంచేందుకు
పదో తరగతిలో పాస్ పర్సెంటేజ్ పెంచేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాస్ లు నిర్వహిస్తున్నారు. దసరా తర్వాత చాలా స్కూళ్లలో ప్రత్యేక తరగతులు ప్రారంభం అయ్యాయి. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఒంటి గంటకు పెడతారు. ప్రత్యేక తరగతులు పూర్తయి ఇంటికి వెళ్లేసరికి దాదాపుగా రాత్రి 7 గంటలు అవుతుంది. విద్యార్థులు అప్పటి వరకు ఏం తినకుండా ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రభుత్వం విద్యార్థులకు స్నాక్స్ అందించాలని నిర్ణయించింది.
విద్యార్థులకు అందించే స్నాక్స్ ఇవే
ఈ ఏడాది మార్చి 21 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ మొదలు కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు 38 రోజులపాటు విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ప్రభుత్వం మంజూరు చేయనుంది. రాష్ట్రంలో ఉన్న 4,500 ప్రభుత్వ హైస్కూల్స్, 194 మోడల్ స్కూళ్లలో సుమారు 1.90 లక్షల మంది పదో తరగతి చదువుతున్నారు. స్నాక్స్ గా ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు-బెల్లం, చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడి, ఉడకబెట్టిన శనగలు రోజుకో ఒక రకం అందించనున్నారు.
టెన్త్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్
విద్యాశాఖ టెన్త్ వార్షిక షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష జరగనుంది. మార్చి 28న ఫిజిక్స్, 29న బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.
21-03-2025 ఫస్ట్ లాంగ్వేజ్
22-03-2025 సెకండ్ లాంగ్వేజ్
24-03-2025 థర్డ్ లాంగ్వేజ్
26-03-2025 మ్యాథమేటిక్స్
28-03-2025 ఫిజికల్ సైన్స్
29-03-2025 బయోలాజికల్ సైన్స్
02-04-2025 సోషల్ స్టడీస్.