Paddy 500 Bonus : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ
Paddy 500 Bonus : తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 11న ప్రయోగాత్మకంగా ప్రారంభించిన రూ.500 బోసస్... తాజాగా రూ.కోటికి పైగా బోనస్ చెక్కులపై పౌర సరఫరాల శాఖ సంతకాలు చేసింది. రానున్న 48 గంటల్లో రైతుల ఖాతాల్లో ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ జమ అవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ చేస్తుంది. సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ.500 చొప్పున జమ చేస్తుంది. ఈ నెల 11న ప్రయోగాత్మకంగా ఓ రైతు ఖాతాలో క్వింటాకు రూ.500 చొప్పున రూ.30 వేలు జమ చేశారు. తాజాగా శనివారం సుమారు రూ.కోటి పైగా బోనస్ చెక్కులపై పౌర సరఫరాల శాఖ సంతకాలు చేసి జారీ చేసింది. రానున్న 48 గంటల్లో రైతు ఖాతాల్లోకి రూ.500 బోనస్ డబ్బులు జమ కానున్నాయి.
నవంబర్ 16 నుంచి బోనస్ డబ్బులు
ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి క్వింటాకు అదనంగా 500 చొప్పున రైతుల అకౌంట్లోకి బోనస్ డబ్బులు చేస్తుంది. అయితే వరి ధాన్యం బోనస్ చెల్లించటానికి ఒక ప్రాసెస్ ఉంటుందని అధికారులు అంటున్నారు. సన్న రకాల వడ్లు కొనుగోలు చేశాక దానికి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి చేరాతాయి. ఆ తర్వాత ఒక ప్రాసెస్ ప్రకారం రైతుల ఖాతాల్లోకి బోనస్ ఎంత చెల్లించాలనేదానిపై నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో సమాచారం సేకరిస్తారు. ప్రభుత్వం వద్దకు ఈ సమాచారం వచ్చిన వెంటనే రూ.500 బోనస్‌ను రైతు ఖాతాలోకి రిలీజ్ చేస్తారు. నగదు రిలీజ్ చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి ఆ డబ్బులు జమ అవుతాయి. ఈ ఖరీఫ్ సీజన్‌కి నవంబర్ 16న రైతు ఖాతాల్లోకి డబ్బులను ప్రభుత్వం జమ చేయడం ప్రారంభించిందని అధికారులు చెబుతున్నారు. బోనస్ నగదు ఖాతాల్లో పడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.2 లక్షల రుణమాఫీపై
తెలంగాణలో రూ.2 లక్షల లోపు రైతుల రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారికి కూడా త్వరలోనే మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులకు మేలు జరగాలనే ప్రభుత్వం కోరుకుంటుందని.. రైతులు వారి ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు.
'చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ముందు నిలిచింది. పంజాబ్ , హర్యానా రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ ధాన్యం ఉత్పత్తి అయ్యింది. 40 లక్షల ఎకరాల్లో సన్నం ధాన్యం సాగు అయ్యింది. జనవరి నుంచి సన్న బియ్యం ఇవ్వాలనీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 17 శాతం తేమ కంటే ఎక్కువ ఉన్నా.. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నాం' అని తుమ్మల నాగేశ్వర రావు వివరించారు.
'గత ప్రభుత్వ హయం కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 7411 కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు జరుగుతుంది. ఇప్పటి వరకు 420 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రూ.622 కోట్లు ప్రభుత్వం రైతులకు చెల్లించింది. రూ.500 బోనస్‌ను అదనంగా రైతులకు చెల్లిస్తుంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది' అని తుమ్మల స్పష్టం చేశారు.
'పత్తి దిగుబడి తగ్గినా కొనుగోలులో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. లబ్ధి కోసం ప్రతిపక్షాలు రాజకీయ క్రీడలను మానుకోవాలి. ఒక్క రూపాయి ఎక్కువ వస్తుందంటే రైతులు ఓపెన్ మార్కెట్ కి వెళ్తారు.రైతులు లాభ పడాలనుకోవడంలో తప్పు లేదు. మిల్లర్ల సమస్యల మీద ఇప్పటికే చర్చించాం. మిల్లర్ల కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు' అని తుమ్మల వ్యాఖ్యానించారు.