తెలంగాణ ప్రభుత్వం రెండు సంక్షేమ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. వీటి అమలు కోసం మూడు నెలల్లో దాదాపు రూ.15 వేల కోట్లు అవసరం అని తెలుస్తోంది. ఆ నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ వనరులు, రుణాలపై ఆర్థిక శాఖ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా.. ఇప్పుడు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులను ఎంపిక చేసి.. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్థిక సాయం మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకానికి రూ.6 వేల కోట్లు ఇస్తామని స్పష్టం చేసింది. జూన్ 2 నాటికి ఈ పథకం కోసం రూ.6 వేల కోట్లు నిధులు కావాలి.
ఇక జూన్ నుంచే ఖరీఫ్ పంటల సాగు సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. రైతు భరోసాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు పంటలకు కలిపి.. రూ.18 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. వీటిలో రూ.9 వేల కోట్లను ఖరీఫ్ సాగుకు పెట్టుబడి కింద వ్యవసాయ శాఖకు విడుదల చేయాలి.
ఈ రెండు పథకాల అమలు కోసం జూన్ నాటికి రూ.15 వేల కోట్లను ఆర్థిక శాఖ సిద్ధం చేయాల్సి ఉంది. దీంతో అధికారులు నిధుల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇతర శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా మరిన్ని నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల ఒకటిన ప్రారంభం కాగా.. ఈ నెల 8న బాండ్ల విక్రయం ద్వారా రూ.2 వేల కోట్ల నూతన రుణాల సేకరణకు ఆర్థికశాఖ ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ ఏడాది ఇంధన శాఖకు బడ్జెట్‌లో రూ.21 వేల కోట్లు కేటాయించింది. వీటి నుంచి విద్యుత్ సంస్థలకు రాబోయే మూడు నెలల్లో రూ.5 వేల కోట్ల వరకు విడుదల చేయాల్సి ఉంటుంది. యువ వికాసం, రైతుభరోసా, విద్యుత్ రాయితీ నిధులు తప్పనిసరిగా విడుదల చేయాల్సినవే. అందుకే వాటికే ప్రాధాన్యమిస్తూ సమీకరిస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ భూముల విక్రయాల ద్వారా నిధులు సమీకరించవచ్చని తొలుత భావించారు. కానీ ప్రస్తుతం అది సాధ్యం కాదని తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. కొత్త రుణాల సేకరణపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, పాత రుణాలపై వడ్డీలు, అసలు కిస్తీల చెల్లింపులకే సరిపోతోందని తెలుస్తోంది.
ప్రభుత్వం ప్రాధ్యాన్యత ఇస్తున్న సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సిన నిధులను.. ఇతర మార్గాల ద్వారా సమీకరించక తప్పదని అధికారులు చెబుతున్నారు. అమలు చేయాల్సిన తేదీలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. అధికారులు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
సంబంధిత కథనం