TG Welfare Schemes : లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు, మంత్రి తుమ్మల కీలక ప్రకటన-tg four welfare scheme started minister tummala nageswara rao key comments on indiramma illu ration cards ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Welfare Schemes : లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు, మంత్రి తుమ్మల కీలక ప్రకటన

TG Welfare Schemes : లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు, మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Jan 26, 2025 08:30 PM IST

TG Welfare Schemes : తెలంగాణలో ఇవాళ సంక్షేమ జాతర జరిగింది. ఒకేరోజు నాలుగు సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసాపై కీలక విషయాలు ప్రస్తావించారు.

లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు, మంత్రి తుమ్మల కీలక ప్రకటన
లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు, మంత్రి తుమ్మల కీలక ప్రకటన

TG Welfare Schemes : తెలంగాణ ప్రభుత్వం ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలను ప్రారంభించారు. జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా లబ్దిదారులకు పథకాల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.

yearly horoscope entry point

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మల్లెపల్లిలో నిర్వహించిన ప్రజా పాలన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ...రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు.

నేటి అర్ధరాత్రి నుంచి రైతుల ఖాతాల్లో

ఇందిరమ్మ రాజ్యంలో కష్టాలు తీరుతాయని ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకేరోజు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించుకున్నామన్నారు. రైతు రుణమాఫీ కింద రూ. 21 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా వ్యవసాయ భూమి ఎకరాకు రూ. 12 వేలు సాయం అందజేస్తున్నామని అన్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గుడిసెలు లేకుండా పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థికసాయం చేస్తామన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తామని తెలియజేశారు.

లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. మార్చి 31వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలు అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

కలెక్టర్ తిన్న బియ్యమే పేదలూ తినాలనే

అర్హులైన ప్రతి ఒక్కరికీ నాలుగు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. కలెక్టర్ తినే సన్న బియ్యమే పేదలు తినాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. రైతుల కోసం ఏడాదిలో రూ. 40 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.

ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఆరు గ్యారెంటీలు అమలు చేశామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు దశల వారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో గత పదేండ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రజాప్రభుత్వం రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. దరఖాస్తులు పరిశీలన చేసి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. అధికారులు నిబంధనల మేరకు అర్హులను గుర్తించాలని సూచించారు. అలాగే అర్హత లేకుండా పథకాలు పొందితే బాధ్యతగా తెలియజేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Whats_app_banner