TG DOST 2024 Updates : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' రిపోర్టింగ్ గడువు పెంపు, ఎప్పటివరకంటే..!
Telangana Degree Admissions 2024 : డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక అప్డేట్ ఇచ్చింది. సీట్ల పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేసే గడువును జులై 18వ తేదీ వరకు పొడిగించింది.
Telangana Degree Admissions 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత విద్యా మండలి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… జులై 12వ తేదీతో రిపోర్టింగ్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పించారు.
దోస్త్ ద్వారా మూడు విడతల్లో సీట్లు పొంది రిపోర్టింగ్ చేయనివారు… జులై 18వ తేదీలోపు రిపోర్టింగ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఇప్పటివరకు 1,17,057 మంది మాత్రమే కళాశాలల్లో రిపోర్ట్ చేసినట్లు పేర్కొంది. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును పెంచినట్లు వెల్లడించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించింది.
దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 1,066 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ ప్రక్రియ ద్వారా ఈ సీట్లన్నీ భర్తీ చేస్తున్నారు. జులై 12వ తేదీతో మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును జులై 18వ తేదీకి పొడిగించిన నేపథ్యంలో…. స్పాట్ అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఏపీలోనూ షెడ్యూల్ గడువు పొడగింపు…
AP OAMDC Admissions 2024: ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ కొనసాగుతోంది. జూన్ 18 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా… తాజాగా షెడ్యూల్ గడువును అధికారులు పొడిగించారు.
ఏపీ ఉన్నత విద్యా మండలి తాజా నిర్ణయం ప్రకారం…. రిజిస్ట్రేషన్ కోసం జులై 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన జులై 18 నుంచి 20 తేదీల్లో నిర్వహిస్తారు. జులై 23 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జులై 31వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇంటర్మీడియట్ లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మొదట దశలో ప్రవేశాలను కల్పించారు. 80 శాతం - 90 శాతం మధ్య మార్కులు సాధించిన విద్యార్థులకు రెండో దశలో అడ్మిషన్లు ఇవ్వగా…. 80 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మూడో మరియు చివరి దశలో ప్రవేశాలు ఉంటాయి.
రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో 3.19 లక్షల సీట్లు ఉండగా, గతేడాది 1.53 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా ఈ ప్రవేశాలను ప్రక్రియ కొనసాగుతోంది.
అర్హత ఉన్న విద్యార్థులు https://oamdc-apsche.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇందుకోసం బీసీ విద్యార్థులు రూ. 300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200, జనరల్ కేటగిరీ (ఓసీ) విద్యార్థులు రూ.400 ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ మార్కు షీట్, కుల ధృవీకరణ, ఇతర అవసరమైన పత్రాలు స్కాన్ చేసిన కాపీలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.