TG Caste Census : తెలంగాణలో కులగణన లెక్కలు తేలాయ్, బీసీలే అధికం-ఎవరెంత మంది ఉన్నారంటే?
TG Caste Census : తెలంగాణ కుల గణన సర్వే నివేదికను ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించింది. రాష్ట్రంలో 46.25 శాతం మంది బీసీలు ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కులగణన సర్వే దేశానికే దిక్సూచి అవుతుందన్నారు.
TG Caste Census : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. సుమారు 50 రోజుల పాటు కులగణన సర్వే జరిగింది. ఈ నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందించారు. ఈ సర్వేలో 96.9 శాతం కుటుంబాలు తమ వివరాలు తెలిపాయి. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్లు చెప్పిన అధికారులు...రాష్ట్రంలో 46.25 శాతం బీసీ జనాభా ఉన్నట్లు నిర్థారించారు.

హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కులగణన నివేదిక అందిందని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదన్నారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆశయం మేరకు సామాజిక, కులగణన సర్వే చేశామని చెప్పుకొచ్చారు. దేశంలో బీసీ జనాభా లెక్కించాలనేది రాహుల్ ఆశయమని తెలిపారు.
ఈ నెల 4న కేబినెట్ ముందుకు సర్వే రిపోర్ట్
"1,03,889 మంది ఎన్యుమరేటర్లతో కులగణన సర్వే చేపట్టాం. తెలంగాణ వ్యాప్తంగా 3.54 కోట్ల మందిని సర్వే చేశారు. ఈ నెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ ముందు కులగణన సర్వే రిపోర్ట్ ఉంచుతాం. అసలైన పేదలను గుర్తించేందుకే కులగణన సర్వే చేపట్టాం. కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతాం. బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ఈ సర్వే చేపట్టాం. అసెంబ్లీ చర్చించి, తీర్మానమైన తర్వాత బలహీన వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటాం" - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
దేశానికి తెలంగాణ కులగణన సర్వే ఓ దిక్సూచి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని సర్వే పూర్తి చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఏ వర్గం జనాభా ఎంత ఉందో ప్రభుత్వం దగ్గర డేటా ఉందన్నారు. బీసీ జనాభా 46.25 శాతమని ఉన్నట్లు చెప్పారు. సామాజిక న్యాయం కోసమే కులగణన సర్వే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కులగణన సర్వేలో ముఖ్య విషయాలు
- తెలంగాణలోని మొత్తం 3,54,77,554 మందిని సర్వే
- మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదు
- కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 శాతం
- సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతం
కులగణన సర్వే ప్రకారం
- ఎస్సీలు 17.43 శాతం
- ఎస్టీలు 10.45 శాతం
- బీసీలు 46.25 శాతం
- ఓసీలు 15.79 శాతం
- ముస్లిం మైనారిటీలు బీసీల జనాభా 10.08 శాతం
- ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం
- ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం
- మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం