హైదరాబాద్‌లో తీవ్ర విషాదం జరిగింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ జరిగింది. డబుల్ డెక్కర్ బస్ చక్రాల కింద ద్విచక్ర వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలు అయ్యాయి. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది.
టీఎన్జీవో కాలనీకి చెందిన ప్రభాతి ఛత్రియ.. పదో తరగతి పరీక్షలు రాస్తోంది. పరీక్ష ముగిశాక.. ఆమె అన్నయ్య సుమన్ ఛత్రియ వచ్చి బైక్‌పై ఇంటికి తీసుకెళ్తున్నాడు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్తుండగా.. ఫ్లైఓవర్ మీద ప్రమాదం జరిగింది. బైక్ డబుల్ డెక్కర్ బస్ చక్రాల కింద పడిపోయింది. ఈ ఘటనలో చెల్లి ప్రభాతి ఛత్రియ చనిపోయింది. సుమన్ ఛత్రియకు గాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద ట్రాపిక్ జామ్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. తీవ్రంగా రోధిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చి శాంతిపజేసే ప్రయత్నం చేశారు. రాయదుర్గం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డబుల్ డెక్కర్ బస్ ఆర్టీసీకి చెందినది కాదని.. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నడిచే బస్సు అని తెలుస్తోంది.
హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ సమీపంలోనూ ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ మృతి చెందారు. ఉదయం మార్నింగ్ వాక్ కోసం వెళ్తుండగా.. లక్ష్మారెడ్డిపాలెం వద్ద ప్రమాదం జరిగింది. నందీశ్వర బాబ్డీ (అడిషనల్ డీసీపీ) లక్ష్మారెడ్డిపాలెం సమీపంలోని మైత్రీ కుటీర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం మార్నింగ్ వాక్ కోసం ఇంటి నుంచి బయల్దేరారు. హైదరాబాద్- విజయవాడ హైవే రోడ్డును దాటే క్రమంలో లక్ష్మారెడ్డి పాలెం వద్ద ప్రమాదానికి గురయ్యారు.
ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బాబ్జీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. బాబ్జీ మృతితో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది.