భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి తిరిగి వస్తోన్న తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ చర్యలు చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో, న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ నోడల్ ఆఫీస్ గా పనిచేస్తోంది.
సోమవారం మధ్యాహ్నం వరకు 162 మంది పౌరులు తెలంగాణ భవన్‌కి చేరుకోగా, వీరిలో జమ్మూ కశ్మీర్‌లోని వివిధ విద్యాసంస్థల నుంచి 56 మంది, పంజాబ్ రాష్ట్రం నుంచి 106 మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు.
ఇప్పటి వరకు 133 మంది తమ స్వగ్రామాలకు బయలుదేరగా, మిగిలిన వారికి తెలంగాణ భవన్‌లో తాత్కాలిక వసతి, భోజనం, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్... సోమవారం తెలంగాణ భవన్ అధికారులతో సమీక్ష జరిపి, అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. పరిస్థితి నెమ్మదిగా సాధారణమవుతుండటంతో విద్యాసంస్థలు తిరిగి క్లాసులకు హాజరు కావాలని సూచిస్తున్నాయని విద్యార్థులు తెలిపారు.
అయితే తాము ముందుగా ఇంటికెళ్లి, పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే మళ్లీ క్యాంపస్‌కు వెళ్లాలనుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు.
విద్యార్థుల అభ్యర్థన మేరకు, డా. గౌరవ్ ఉప్పల్ సంబంధిత యూనివర్సిటీల అధికారులతో మాట్లాడి.. విద్యార్థులకు తాత్కాలికంగా ఆన్‌లైన్ తరగతులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీలు అందుకు సానుకూలంగా స్పందించాయి.
కాగా కొంతమంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు పరిస్థితి మెరుగుపడే వరకు ఢిల్లీలోనే వేచి చూసి తిరిగి క్యాంపస్లకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలపగా వారు తిరిగి వెళ్లేవరకు తెలంగాణ భవన్ లోనే ఉండేదుకు అన్ని వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ఇక, గడిచిన 24 గంటలుగా సహాయం కోసం చేసే అత్యవసర కాల్స్ గణనీయంగా తగ్గాయని, చాలా తక్కువ మంది విద్యార్థులు మాత్రమే తెలంగాణ భవన్ కి వచ్చే అవకాశం ఉందని తెలంగాణ భవ్ అధికారులు తెలిపారు. తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరు సహాయం కోసం వస్తే వారికి అన్ని విధాలా అండగా ఉంటామని డా. గౌరవ్ ఉప్పల్ స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా దిల్లీలోని ఏపీ భవన్‌కు ఏపీకి చెందిన విద్యార్థులు చేరుకుంటున్నారు. వీరి సంఖ్య 350కి చేరింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్‌ల్లోని పలు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు...ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. దిల్లీ చేరుకున్న వీరికి ఏపీ భవన్ అధికారులు తాత్కాలిక వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు.
శనివారం రాత్రి 91 మంది విద్యార్థులు ఉండగా, ఆదివారం నాటికి ఆ సంఖ్య 350కు చేరిందని ఏపీ భవన్ అధికారులు ప్రకటించారు. ఇక్కడి సిబ్బంది రైలు టికెట్ కన్ఫర్మేషన్ చేయించడంతో పాటు, ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు.
సరిహద్దు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ఏపీ వాసులు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సాయం కోసం 011-23387089, 98719 99430, 98719 99053 నంబర్లను సంప్రదించాలని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ తెలిపారు.
అదనపు సమాచారం, సహాయం కావాలంటే ఏపీ భవన్ డిప్యూటీ కమిషనర్ ఎంవీఎస్ రామారావు నెంబర్ 98719 90081, లైజన్ ఆఫీసర్ వి.సురేష్‌బాబు నెంబర్ 9818395787లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం