Karimnagar Town : హనుమాన్ భక్తుల ర్యాలీలో వివాదం...! కరీంనగర్ సిటీలో ఉద్రిక్త పరిస్థితులు
Tension in Karimnagar Town : కరీంనగర్ లో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ దీక్షదారులు చేపట్టిన ర్యాలీలోకి ఓ అంగతకుడు చొరబడటంతో గొడవ మొదలైంది. పరిస్థితులను అదుపులోకి తీసుకుచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ కు దిగారు.
Karimnagar Town : కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ దీక్ష స్వాముల ర్యాలీలో అగంతకుడు సృష్టించిన గొడవ, లాఠీ చార్జ్ కి దారి తీసింది. పోలీసుల తీరును నిరసిస్తూ హనుమాన్ దీక్ష స్వాములు, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. వాగ్వాదం తోపులాట తో ఘర్షణ వాతావరణంలో పోలీసు వాహనం ధ్వంసమయింది. ఓ పోలీస్ కు గాయాలయ్యాయి. పోలీసులు హనుమాన్ దీక్ష స్వాములతో పాటు బిజెపి కార్యకర్తలను అరెస్టు చేశారు. అర్థరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.
ర్యాలీ లో మొదలైన గొడవ..
హనుమాన్ దీక్ష స్వాములు కరీంనగర్ లో ర్యాలీగా నిర్వహించారు. ప్రశాంత్ నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద ర్యాలీలోకి మద్యం మత్తులో ఓ యువకుడు దూరి కత్తితో డ్యాన్స్ చేయడంతో హనుమాన్ భక్తులు అడ్డుకున్నారు. హనుమాన్ భక్తుల కు మద్యం మత్తులో ఉన్న యువకుడికి మధ్యం మత్తులో ఉన్న యువకుడికి వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది.
వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనంలో స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. హనుమాన్ భక్తులు పోలీసు వాహనాన్ని వెంబడించారు. మద్యం మత్తులో యువకుడిపై దాడికి యత్నించారు. పోలీసులు వేగంగా వాహనాన్ని ముందుకు తీసుకెళ్లగా ఓ హనుమాన్ భక్తుడు పోలీస్ వాహనాన్ని గట్టిగా పట్టుకొని గాల్లో వేలాడుతుండగా పోలీసులు వాహనాన్ని అలానే స్పీడ్ గా తీసుకెళ్ళారు.
హనుమాన్ భక్తులు పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ పరిగెత్తడంతో కొద్ది దూరం వెళ్ళాక పోలీసులు వాహనాన్ని ఆపడంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు హనుమాన్ భక్తులకు మధ్య వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. హనుమాన్ భక్తులను చెదరగొట్టి పోలీసులు మద్యమత్తులో ఉన్న వ్యక్తిని స్టేషన్ కు తరలించారు.
త్రీ టౌన్ ముందు ఆందోళన.. లాఠీఛార్జీ….
హనుమాన్ భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసుల తీరును నిరసిస్తూ పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు, బిజెపి కార్యకర్తలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరారు. స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్టేషన్ ను ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు లాఠి ఛార్జ్ చేసి చెదరగొట్టారు. పలువురు హనుమాన్ భక్తులతో పాటు బిజెపి కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బీజేపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.
బండి సంజయ్ ఆగ్రహం….
హనుమాన్ భక్తుల, బిజెపి కార్యకర్తల పట్ల పోలీసుల తీరుపై బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి హుటాహుటిన కరీంనగర్ కు బయలుదేరిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అసలేం జరిగిందో తెలుసుకుని డిజిపి తో ఫోన్లో మాట్లాడారు.
హనుమాన్ భక్తులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిందిస్థాయి అధికారులు చెప్పే అబద్దాలకు అనుగుణంగా వ్యవహరించొద్దని సూచించారు. తాము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదని.. తప్పుడు సమాచారంతో సమస్యను జఠిలం చేసే పోలీసులకే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. వాస్తవాలను తెలుసుకుని సమస్యను పరిష్కరించాలని డిజిపి ని సంజయ్ కోరారు.
అర్ధరాత్రి దాటాక వదిలి పెట్టిన పోలీసులు…
హనుమాన్ భక్తులపై లాఠీఛార్జ్ అరెస్టు ను నిరసిస్తూ కాషాయ దళం కరీంనగర్ కు తరలిరావడంతో అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బండి సంజయ్ సైతం హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు రావటంతో ఉత్కంఠ ఏర్పడింది.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న హనుమాన్ భక్తులతో పాటు బిజెపి కార్యకర్తలను అర్థరాత్రి దాటాక వదిలిపెట్టారు. భవిష్యత్తు కార్యాచరణ చేపట్టే పనిలో బిజెపి నాయకులు నిమగ్నమయ్యారు. పరిస్థితి చేజారి పోకుండా ఉండేందుకు పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. నగరంలో పోలీసులు భారీగా మోహరించారు.