ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు పరేషాన్ అవుతున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్ అడవులపై కూడా భద్రతా బలగాలు పట్టు సాధిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. చుట్టుముట్టేశాయి. రోజురోజూకు చొచ్చుకెళ్తున్నాయి. ఈ సమయంలో మావోయిస్టులు అష్టదిగ్బంధంలో చిక్కుకుపోయారనే ప్రచారం జరుగుతోంది.
అసలే వయోభారం.. ఆపై అనారోగ్యం.. నలువైపుల నుంచి తరుముకొస్తున్న భద్రతా బలగాలతో.. మావోయిస్టు అగ్రనేతలు కూడా కకావికలం అవుతున్నారు. బస్తర్‌లో బలగాల నిర్బంధం ఉద్ధృతమవుతున్న పరిస్థితుల్లో అక్కడే ఉండలేక.. బయటికి వెళ్లే మార్గం దొరకని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అయితే బలగాల ఎదుట లొంగిపోవడం.. లేదంటే ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోవడమే వారి ముందున్న మార్గాలు అని పోలీసులు చెబుతున్నారు.
రెండ్రోజుల కిందట జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ చనిపోవడంతో.. అక్కడికి సమీపంలోనే పార్టీ పొలిట్‌బ్యూరో అగ్రనేతలు తలదాచుకొని ఉంటారని భద్రత బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో శాంతి చర్చల మాట గట్టిగా వినిపిస్తోంది. అయినా కేంద్రం మాత్రం ఆ డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. అడవుల్లో కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేస్తోంది.
మావోయిస్టు పార్టీ అవతరించినప్పుడు.. కేంద్ర కమిటీలో 34 మంది నేతలుండేవారు. వారి నుంచి పొలిట్‌బ్యూరోలో 16 మంది ఉండేవారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 16 మంది అగ్ర నేతలుండగా.. పొలిట్‌బ్యూరోలో నలుగురు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పార్టీ మాజీ చీఫ్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మిసిర్‌బెస్రా మాత్రమే ఉన్నారు.
మొదటి ముగ్గురు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే. వీరు కాకుండా కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన మల్లా రాజిరెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాదరావు, పాక హన్మంతు, కట్టా రాంచంద్రారెడ్డి, పోతుల కల్పన అన్నారు. ఏపీ నుంచి తెంటు లక్ష్మీనర్సింహాచలం తోపాటు ఝార్ఖండ్ నుంచి వివేక్‌చంద్రి యాదవ్, పతిరాం మాంజీ.. పశ్చిమ్‌బెంగాల్ నుంచి సబ్యసాచి గోస్వామి ఉన్నారు.
అరెస్టులు, ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల కారణంగా మావోయిస్టు పార్టీ అవతరించిన నాటి సంఖ్యతో పోల్చితే.. కేంద్ర కమిటీలో సభ్యుల సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. ఒకవేళ కూంబింగ్ ఉద్ధృతి తగ్గి.. పరిస్థితులు అనుకూలిస్తే పొలిట్ బ్యూరోలోని నలుగురిలో ఒకరు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశముంది. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్న నేతలంతా 1980 దశకంలో ఉద్యమ బాట పట్టినవారే. దీంతో వారు వయోభారం, అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంబంధిత కథనం