Saroornagar Apsara Murder Case : సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు
సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును వెలువరించింది. నిందితుడైన పూజారికి జీవిత ఖైదు విధించింది. అప్సర అనే యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమాయణం నడిపిన పూజారి సాయికృష్ణ.... అప్సరను చంపి సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సంగతి తెలిసిందే.
సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు పడింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టు తుది తీర్పును వెలువరించింది. 2023లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
అప్సర అనే యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమాయణం నడిపిన పూజారి సాయికృష్ణ.... అప్సరను చంపి సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అంతేకాకుండా సాక్ష్యాలను లేకుండా ప్రయత్నం చేయగా… అసలు విషయం బయటికి రావటంతో పూజారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
ఈ కేసును దర్యాప్తు చేసిన సరూర్ నగర్ పోలీసులు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన న్యాయస్థానం…. సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించటంతో మరో ఏడేళ్ల పాటు జైలు శిక్షను ఖరారు చేసింది.
అసలేం జరిగిందంటే..?
2023 జూన్ 3న అప్సర హత్య జరిగింది. శంషాబాద్ శివార్లలో ఈ ఘటన జరిగినప్పటికీ…. ఆమె శవాన్నీ సరూర్‌నగర్ ఎమ్మార్వో ఆఫీసు వెనుక ఉన్న మ్యాన్ హోల్‌లో పడేశారు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు… అన్ని కోణాల్లో విచారించారు. అయితే ఇదంతా కూడా పూజారి సాయికృష్ణ చేసినట్లు తేలింది. అతడిని విచారించగా… అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు.
అప్సర అనే యువతి అదృశ్యమైందంటూ సూర్య సాయికృష్ణ అనే పూజారి రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3వ తేదీన అప్సరను భద్రాచలం వెళ్లడానికి శంషాబాద్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సమీపంలో వాహనం ఎక్కించానని జూన్ 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదుదారుడు చెప్పిన వివరాలు క్షేత్ర స్థాయిలో ఉన్న ఆధారాలతో సరిపోక పోవడంతో పోలీసులు అనుమానించారు. మరోవైపు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అప్సరకు తాను మేనమామ అవుతానని తెలిపాడు. పోలీసుల విచారణలో మృతురాలితో అతనికి ఎలాంటి బంధుత్వం లేదని గుర్తించారు. దీంతో అతని పాత్రపై విచారణ చేపట్టారు.
సాయికృష్ణ చెప్పే వివరాలకు పొంతన లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 3వ తేదీన సాయికృష్ణ సుల్తాన్ పల్లిలో హత్య చేసినట్లు గుర్తించారు. నాలుగేళ్ల క్రితం అతను సుల్తాన్‌పల్లి గోశాలలో ఉన్న ఆలయంలో పని చేసేవాడు. అప్సరతో ఉన్న పరిచయం, వివాహేతర సంబంధం నేపథ్యంలో 3వ తేదీన సుల్తాన్ పల్లి తీసుకొచ్చాడు.ఆ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణపై అప్సర ఒత్తిడి చేయడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఈ క్రమంలో ఆమెను బండరాయితో తలపై కొట్టి చంపేశాడు.
ఆ తర్వాత సుల్తాన్‌పల్లి నుంచి శవాన్ని కారులో సరూర్ నగర్ ఎమ్మార్వో ఆఫీసు కు చేర్చాడు. సరూర్ నగర్ ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని ఆలయంలోనే సాయికృష్ణ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అక్కడకు వచ్చే అప్సరతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న సాయికృష్ణ ఆమెతో పెళ్లికి నిరాకరించడంతో వివాదం తలెత్తింది. హత్య తర్వాత తన ఇంటికి సమీపంలో ఉన్న ఎమ్మార్వో ఆఫీసు మ్యాన్ హోల్‌లో పడేశాడు.
రెండ్రోజుల తర్వాత పోలీసులకు ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అతని చెప్పిన సమయంతో పాటు ఆ తర్వాత కూడా ఇద్దరి మొబైల్ ఫోన్ లొకేషన్స్ ఒకే చోట ఉండటంతో పోలీసులు అనుమానించారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీల్లో ఇద్దరు కలిసి ఒకే వాహనంలో ప్రయాణించినట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో హత్య విషయాన్ని సాయికృష్ణ వెల్లడించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదును విధించింది.
సంబంధిత కథనం