Telangana Weather : తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత .. పడిపోతున్న ఉష్ణోగ్రతలు-temperatures drop in telangana with effect of winter season ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Temperatures Drop In Telangana With Effect Of Winter Season

Telangana Weather : తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత .. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 25, 2023 11:02 AM IST

Telangana Weather Updates: తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చలి తీవ్రత మొదలైపోయింది. శీతాకాలం సమీపించిన వేళ చలి వణుకు పుట్టిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

తెలంగాణలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు (DD New Twitter)

Cold Wave Increased in Telangana: వర్షాకాలం ముగియడంతో రాష్ట్రంలో క్రమంగా చలి పెరుగుతోంది. నవంబర్ మాసం రాకముందే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్టోబర్ చివరి వారం నుంచే చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటలు కూడా కాకుండానే.. చలి పెరుగుతోంది. ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు

నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు వీస్తున్నాయి. చల్లటి గాలుల కారణంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కమ్మేస్తోంది. హన్మకొండ, ఆదిలాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉత్తర దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక హన్మకొండ జిల్లాలో చలి తీవ్రత అత్యధికంగా ఉంది. ఇక్కడ రాత్రిపూట 22.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా.. అక్టోబరు 23వ తేదీన రాత్రి 16 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదైంది. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. ఇక రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ లో 14 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్, మౌలాలి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇదే సమయంలో హైదరాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో పగటి పూట సాధారణం కంటే కొంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా చలి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని… అక్టోబరు 31 వతేదీన తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

WhatsApp channel