AP Telangana CMs Meeting : నేడు ఏపీ, తెలంగాణ సీఎంల కీలక భేటీ - విభజన సమస్యలే ప్రధాన అజెండా..!
Telugu States Chief Ministers Meeting : ఇవాళ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నాయి. హైదరాబాద్ వేదికగా ఈ సమావేశం జరగనుంది. విభజన సమస్యలతో పాటు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Telugu States Chief Ministers Meeting : ఇవాళ హైదరాబాద్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు.
ఈ భేటీ కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు. వీటి పరిష్కారం కోసం కలిసి చర్చించుకుందామని కోరారు. జులై 6వ తేదీన కలిసి చర్చించుకుందామని ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సానుకూలంగా స్పందించారు. దీంతో ఈ కీలక భేటీ ఇవాళ హైదరాబాద్ వేదికగా జరగనుంది.
ఈ భేటీలో పలువురు మంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర శాఖల కార్యదర్శులు పాల్గొనున్నారు. ఈ భేటీలో చర్చించేందుకు ప్రధానంగా 10 అంశాలను ఖరారు చేసినట్లు సమాచారం.
రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా షెడ్యూలు 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించనున్నారు.
షీలాబేడీ కమిటీతో నివేదిక ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాలతో పాటు పదో షెడ్యూల్ లో ఉన్న విద్యా సంస్థల పంపిణీపై వివాదాలు తలెత్తాయి. పదేళ్ల కాలం నుంచి ఇవి పెండింగ్ లోనే ఉన్నాయి. వీటిపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల కేటాయింపులపై నెలకొన్నసమస్యలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక విద్యుత్ బకాయిల విషయంలో ఏపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని చాలా రోజులుగా అక్కడి ప్రభుత్వం కోరుతూ వస్తోంది. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంలో ఏపీ వాదన ఒకలా ఉంటే… తెలంగాణ వాదన మరోలా ఉంది. ఇవాళ్టి భేటీలో ప్రధానంగా విద్యుత్ బకాయిల అంశం చర్చకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5 ప్రకారం… జూన్ 2, 2014 నుంచి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ అనేది… తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. 10 సంవత్సరాల వ్యవధి ముగిసిన తర్వాత… హైదరాబాద్ అనేది తెలంగాణకు శాశ్వత రాజధానిగా ఉంటుంది. ఈ పదేళ్ల కాలంలో పాలన కోసం హైదరాబాద్ లోనూ పలు భవనాలను ఏపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. ఇటీవలనే ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోయింది. తెలంగాణకు మాత్రమే రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది.
ఉమ్మడి రాజధానిలో భాగంగా హైదరాబాద్ లో ఏపీకి పలు భవనాలను కేటాయించారు. ఇక్కడ్నుంచి కార్యక్రమాలను కొనసాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. వీటి గడువు కూడా జూన్ 2వ తేదీతో ముగిసిపోయింది. 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని మే 15న జరిగిన అధికారిక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి కూడా అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లో ఉన్న కొన్ని భవనాల విషయంలో కొద్దిరోజుల కింద ఏపీ ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది. ఆంధ్రాలో శాశ్వత భవనాలను ఏర్పాటు చేసుకునే వరకు మరో సంవత్సరం పాటు ఉంచడానికి అనుమతించాలని అభ్యర్థించింది. అద్దె చెల్లించేందుకు కూడా సిద్ధమని తెలిపినట్లు సమాచారం. అయితే ఈ బిల్డింగుల స్వాధీనంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది. ఈ అంశాలపై కూడా ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు రావొచ్చని తెలుస్తోంది.