హైదరాబాద్ లో ప్రముఖ న్యూస్ యాంకర్ సూసైడ్ - అసలేం జరిగింది...?-telugu news anchor swetcha found dead at home suicide suspected in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్ లో ప్రముఖ న్యూస్ యాంకర్ సూసైడ్ - అసలేం జరిగింది...?

హైదరాబాద్ లో ప్రముఖ న్యూస్ యాంకర్ సూసైడ్ - అసలేం జరిగింది...?

తెలుగు న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) హైదరాబాద్ లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు… అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

జర్నలిస్ట్ స్వేచ్ఛా (Photo: X)

తెలుగు న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) సూసైడ్ చేసుకుంది. శుక్రవారం హైదరాబాద్ లోని చిక్కడపల్లిలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్వేచ్ఛా ప్రస్తుతం టీ న్యూస్ లో న్యూస్ ప్రెజెంటర్ గా పని చేస్తున్నారు. గతంలోనూ ప్రముఖ తెలుగు టీవీ ఛానెళ్లలో పని చేశారు. ఆమెకు ఓ కుమార్తె కూడా ఉంది. శుక్రవారం సాయంత్రం కుమార్తె పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చి చూడగా బెడ్ రూమ్ డోర్ లాక్ అయి ఉండటాన్ని గమనించింది. పలుమార్లు తట్టినా స్పందన లేకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. డోర్ తీసి చూడగా… ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.

అసలేం జరిగింది…?

స్వేచ్ఛాకు గతంలో వివాహం కాగా…భర్తతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం కుమార్తెతో కలిసి ఉంటుంది. అయితే ఆమె గత కొంతకాలంగా పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు తెలిస్తోంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్య విభేదాలు నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకుందా.. ?లేక ఇంకా ఏమైనా జరిగిందా…? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

చంపారనే అనుమానం ఉంది - స్వేచ్ఛ తల్లి

తమ కూతురును చంపారని అనుమానంగా ఉందని జర్నలిస్టు స్వేచ్ఛ తల్లి ఆరోపిస్తున్నారు. ఎవరో చంపి వేలాడదీసినట్టు అనుమానంగా ఉందన్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇది ప్లాన్ ప్రకారంగా చేసినట్టు అనుమానంగా ఉందని చెప్పుకొచ్చారు.

“చిన్నప్పటినుండే పుస్తకాలు బాగా చదివేది.. కథలు రాస్తుండేది. మంచి రచయిత.. జర్నలిజంలో పీహెచ్ డీ చేసింది. సామాజిక సమస్యల మీద వ్యాసాలు, కవితలు రాసింది. జీవితాలను, కష్టాలను చదివింది. అందరి సమస్యలను పరిష్కరించేది. నా సమస్యను నేనే పరిష్కారం చేసుకుంటా. వేరే ఎవరు చేయలేరని చెప్పింది. పర్సనల్ సమస్యను అలానే డీల్ చేసుకుంటుంది. నిన్న ఉదయం మాతో ఫోన్లో మాట్లాడింది. సాయంత్రం పాపను వాళ్ళ తాతయ్య స్కూల్ నుండి తీసుకొచ్చాడు. అందరికీ ధైర్యం చెప్పే తను ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు” అని తల్లి వివరించింది.

ఇక స్వేచ్ఛ మృతిపై మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఇక పలువురు మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు స్వేచ్ఛ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్వేచ్ఛ మృతి కేసును లోతుగా విచారించాలని.. అసలు వాస్తవాలు బయటికి తీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.