TFI Meets CM Revanth: కన్నెర్ర చేసిన రేవంత్, నేడు తెలంగాణ సీఎం, మంత్రులతో భేటీ కానున్న తెలుగు సినీ ప్రముఖులు
TFI Meets CM Revanth: పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, అల్లు అర్జున్ అరెస్ట్ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు నేడు ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరుగనుంది.
TFI Meets CM Revanth: ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలపై అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నెర్ర చేయడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని రేవంత్ రెడ్డి ప్రకటించడం తెలుగు సినీ పరిశ్రమలో అలజడి రేగింది. సంక్రాంతి పండక్కి భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో కలకలం రేగింది. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులపై విమర్శలు తలెత్తడంతో పోలీసులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్‌ను అనుమతించే విషయంలో చిక్కడపల్లి పోలీసులు థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నా దానిని పోలీసులు తిరస్కరించారు. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30గంటల సమయంలో అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉన్న సమయంలో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చారు. దీంతో థియేటర్ బయట పుష్ప ప్రేక్షకుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో ఎల్‌బి నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన పరిణామాలపై సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో పరిశ్రమలో అలజడి రేగింది. ఆ తర్వాత అసెంబ్లీలో ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఐఎం కోరడంతో అల్లు అర్జున్ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున మానవత్వం లేకుండా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రేక్షకులను దోచుకునేలా సాగుతున్న వ్యవహారాన్ని ఇకపై అనుమతించనని, తెలంగాణలో బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
ముఖ్యమంత్రి ప్రకటనతో హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న సినీ పరిశ్రమలో అలజడి రేగింది. సంక్రాంతి పండక్కి పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కావాల్సి ఉంది. టిక్కెట్ల ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన సినీ నిర్మాత దిల్ రాజు ముఖ్యమంత్రితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
హాజరయ్యేది. వీరే…
ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం జరుగనుంది. దిల్‌రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. సినీ నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్, హీరోల నుంచి వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ హాజరయ్యే అవకాశం ఉంది.
దర్శకుల నుంచి వీరశంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయిరాజేష్, హరీష్ శంకర్, అనిల్, బాబీ, వంశీ, మా అసోసియేషన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ కూడా హాజరవుతారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చిస్తారు. ఉదయం 11.30గంటలకు సీఎం కర్ణాటక పర్యాటనకు వెళ్లాల్సిన నేపథ్యంలో ఈ లోపు సమావేశం ముగిసే అవకాశాలు ఉన్నాయి.
సంబంధిత కథనం