Paddy Procurement : యాసంగి ధాన్యం.. చివరి గింజ వరకు కొంటాం.. మంత్రి హరీశ్ రావు-telangana will procure entire yasangi paddy says minister harish rao ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Will Procure Entire Yasangi Paddy Says Minister Harish Rao

Paddy Procurement : యాసంగి ధాన్యం.. చివరి గింజ వరకు కొంటాం.. మంత్రి హరీశ్ రావు

HT Telugu Desk HT Telugu
Mar 05, 2023 09:16 PM IST

Paddy Procurement : యాసంగిలో ఉత్పత్తి అయ్యే ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎన్ని ఆటంకాలు, సవాళ్లు ఎదురైనా రైతులు పండించిన చివరి గింజ వరకు సేకరిస్తామని చెప్పారు. దక్షిణ భారత దేశంలో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించిందని మంత్రి వివరించారు.

మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు

Paddy Procurement : గతంలోలానే ఈ యాసింగిలో ఉత్పత్తి అయ్యే వరి ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. బియ్యం సేకరణపై కేంద్రం విధానంతో సంబంధం లేకుండా.. పండే ప్రతి గింజా ప్రభుత్వం సేకరిస్తుందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని.. అనేక కొర్రీలు పెడుతోందని హరీశ్ విమర్శించారు. రాష్ట్రంలో పండే ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని కోరేందుకు 2020లో రాష్ట్రం నుంచి ప్రతినిధులు బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని కలిసిందని... ఆయన మాత్రం నూకల బియ్యం తినండంటూ తెలంగాణ ప్రజలని అవమానించారని చెప్పారు. యాసంగిలో ఉత్పత్తి అయ్యే బియ్యం తీసుకునేందుకు నిరాకరించారని పేర్కొన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేయలేదని.. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి... రైతుల పండించిన చివరి గింజ వరకూ సేకరించారని చెప్పుకొచ్చారు. ఆదివారం (మార్చి 5న) సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో అమరవీరుల స్తూపాన్ని మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ... ఎన్ని ఆటంకాలు, సవాళ్లు ఎదురైనా, రైతులు పండించిన యాసంగి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. దక్షిణ భారత దేశంలో అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందన్న మంత్రి... యాసంగిలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగైందని చెప్పారు. ఇదే సీజన్ లో ఆంధ్రప్రదేశ్ లో కేవలం 16 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని వివరించారు. తెలంగాణ వాసులు మక్క గట్క, జొన్న గట్క తినేవారనీ, అన్నం తినడం నేర్పించింది టీడీపీ పార్టీనేని చంద్రబాబు చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. తెలంగాణ భూమికి బరువయ్యేంత పంట పండించిందని... వరినాట్లు వేసేందుకు పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పరిస్థితులు వచ్చాయని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ ఒకేసారి వేస్తే... యువతను బీజేపీకి దూరం చేసేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనడం ప్రతిపక్షాల మానసిక పరిస్థితికి అద్దం పడుతుందని మంత్రి హరీశ్ విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని... సరిహద్దు గ్రామాల ప్రజలు తమని తెలంగాణలో కలపాలని చేస్తున్న డిమాండ్లు ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నడి బొడ్డున డాక్టర్‌ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు మీద నిర్మిస్తున్న సెక్రటేరియట్ ను కూల గొడతామని ఒకరు... ప్రగతి భవన్ ను పేల్చేస్తామని మరో ప్రతిపక్ష మాట్లాడుతున్నారని.... ఇలాంటి నేతలు తెలంగాణలో ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point